విశాఖ అచ్యుతాపురం సెజ్‌లో ఎస్సెన్షియా ఫార్మా కంపెనీలో చోటుచేసుకున్న భారీ పేలుడు ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అచ్యుతాపురం ఫార్మా ప్రమాదంపై ప్రభుత్వం స్పందించిన తీరు బాధాకరమన్నారు. గాయపడిన వారిని కంపెనీ బస్సుల్లో తరలించారని.. ప్రభుత్వం కనీసం అంబులెన్సులు కూడా ఏర్పాటు చేయలేదని జగన్ ఆరోపించారు.
బాధితులకు న్యాయం జరగకపోతే.. వారి తరఫున తాను పోరాటం చేస్తానన్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు.. తమ ప్రభుత్వం తక్షణమే స్పందించిందని.. 24 గంటల్లో చనిపోయిన బాధిత కుటుంబాలకు కోటి రూపాయలు ఇచ్చామని జగన్ గుర్తు చేశారు. అయితే జగన్ వ్యాఖ్యలపై తాజాగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు.
అబద్ధాలే జన్మనక్షత్రం, తప్పుడు ప్రచారాలే లక్ష్యంగా జగన్ వ్యవహరిస్తున్నారని అచ్చెన్న ఎద్దేవ చేశారు. అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి.. బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని, నష్టపోయిన ప్రతి ఒక్కరికీ పరిహారం అందిస్తామని హామీ ఇచ్చినా జగన్ మాత్రం నిస్సిగ్గుగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
నిమిషాల వ్యవధిలోనే ప్రభుత్వ యంత్రాంగం, అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకుని వైద్యం అందిస్తే ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదని జగన్ ఎలా అంటారు? అని అచ్చెన్న నిలదీశారు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగినప్పుడు 15 రోజుల వ్యవధిలో చనిపోయిన ముగ్గురికి రూ.లక్షతో పరిహారం సరిపెట్టిన విషయం నిజం కాదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై జగన్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు.