ఏపీలో పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ తీవ్రంగా ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలు, బెదిరింపులు నివారించేందుకు నిమ్మగడ్డ ప్రత్యేక్యంగా ఈ-వాచ్ యాప్ ను రూపొందించేలా అధికారులను ఆదేశించారు. అయితే, ఈ యాప్ ను తప్పుబట్టిన ఏపీ సర్కార్….ఆ యాప్ భధ్రతపై సందేహాలు లేవనెత్తుతూ హైకోర్టును ఆశ్రయించింది. వెబ్ కాస్టింగ్ పేరుతో ఆల్రెడీ ఓ యాప్ అమలవుతోందని, కొత్తగా ఈ-వాచ్ యాప్ అవసరం లేదని ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలోనే ఈ-వాచ్ యాప్ ను నిలిపివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ-వాచ్ యాప్‌ను ఫిబ్రవరి 9వ తేదీ వరకు వినియోగించవద్దనిన్యాయస్థానం ఆదేశించింది. ఈ-వాచ్ యాప్‌కు సెక్యూరిటీ డేటా సర్టిఫికెట్ కోసం గురువారం దరఖాస్తు చేశారని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ కోర్టుకు తెలిపింది. యాప్ నకు అనుమతి ఇచ్చేందుకు 5 రోజులు పడుతుందని ఏపీటీఎస్ చెప్పింది. దీంతో, ఫిబ్రవరి 9లోపు ఆ యాప్‌ను పరిశీలించాలని ఏపీటీఎస్‌కు హైకోర్టు ఆదేశించింది.
ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ఇటు ప్రభుత్వం, అటు ఎస్ఈసీ తరఫు న్యాయవాదులు వాడీవేడీ వాదనలు వినిపించారు. ఈ యాప్ భద్రతపై అనుమానాలున్నాయని, హ్యాక్ అయ్యే అవకాశముందని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. భద్రతాపరమైన అనుమతులు లేకుండానే ఈ-వాచ్ యాప్‌ను రహస్యంగా తయారు చేశారని తెలిపారు. అయితే, ఎస్ఈసీకి ఒక యాప్‌ను రూపొందించుకునే అనుమతి భారత ఎన్నికల సంఘం ఇచ్చిందని ఎన్నికల కమిషనర్ తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. గతంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికల కమిషన్ కూడా ఇలా సొంతగా యాప్ తయారు చేసుకుందని వెల్లడించారు. ఏపీటీఎస్ ఈ యాప్ నకు సంబంధించిన సెక్యూరిటీ సర్టిఫికెట్ రావడానికి మరో 5 రోజులు పడుతుందని వెల్లడించింది. దీంతో, ఈ నెల 9వరకు ఆ యాప్ ను వినియోగించవద్దని కోర్టు ఆదేశించింది. ఫిబ్రవరి 9కి తదుపరి విచారణ వాయిదా వేసింది.