టీడీపీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. తనకు రాజకీయాలపై ఆసక్తి తగ్గిపోయిందని కేశినేని నాని గతంలో చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. ఈ క్రమంలోనే నాని సోదరుడు కేశినేని చిన్ని విజయవాడ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారని, రాబోయే ఎన్నికలలో తన అన్న స్థానంలో పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలు పెట్టారని ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలోనే నాని వ్యతిరేక వర్గాన్ని చిన్ని కలిశారని, దాంతోపాటు తన కారుపై కేశినేని చిన్ని ఎంపీ స్టిక్కర్ వేసుకోవడంపై నాని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుకు, నానికి మధ్య గ్యాప్ వచ్చిందని పుకార్లు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా టీడీపీపై ఎంపీ కేసినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ప్రక్షాళన జరగాల్సిందేనని, ప్రజాస్వామ్యంలో 420, కాల్ మనీ వ్యాపారస్తులు కూడా భాగస్వాములయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
చీటర్లకు, రియల్ ఎస్టేట్ మోసగాళ్లకు, కబ్జాకోరులకు టిడిపి టికెట్లు ఇవ్వకూడదు అంటూ కేసినేని నాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గొప్ప ఆశయాలు, సిద్ధాంతాలతో టిడిపి ఏర్పడిందని, ఎవరికి పడితే వారికి టికెట్లు ఇచ్చి పార్టీ సైద్ధాంతిక బలాన్ని దెబ్బతీయొద్దని కేశినేని నాని అన్నారు. టిడిపిలో ముగ్గురు నేతలున్నారని, వారికి టికెట్లు ఇస్తే తాను కచ్చితంగా పనిచేయనని కేశినేని తేల్చి చెప్పేశారు. తన తమ్ముడికి సీటు ఇస్తే చచ్చినా మద్దతు ఇవ్వబోనని కేశినేని షాకింగ్ కామెంట్స్ చేశారు.
నా తమ్ముడు యాక్టివ్ గా పాలిటిక్స్ లో ఉంటే మంచిదే, ఆయన వెంట తిరగమనండి, నా వెంట ఎందుకు అంటూ కేశినేని అసహనం వ్యక్తం చేశారు. అలాకాకుండా మంచివారికి టికెట్ ఇస్తే ఎంపీగా గెలిపించేందుకు తాను కూడా కృషి చేస్తానని అన్నారు. తనకు క్యారెక్టర్ ఉందని, ఎవరినీ మోసం చేసేందుకు రాజకీయాలలోకి రాలేదని కేశినేని వ్యాఖ్యానించారు. ఎంపీ అయినందువల్లే తనకు ఈ స్థాయి రాలేదని, తనకు ఎప్పటినుంచో బ్రాండింగ్ ఉందని కేశినేని అన్నారు. తన స్థాయి ఢిల్లీ వరకు ఉందని, తన సేవలు అవసరం అనుకుంటే పార్టీ వాడుకోవచ్చని సూచించారు. మరి, కేశినేని కామెంట్లపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందన ఏ విధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.