విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని మళ్లీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికలకు ముందు వరకు కేశినేని నాని టీడీపీలో ఉన్నారు. విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి రెండుసార్లు టీడీపీ ఎంపీగా ప్రాథమిథ్యం వహించారు. 2019లో ఫ్యాన్ ప్రభంజనాన్ని తట్టుకుని నిలబడ్డ నేతల్లో నాని ఒకరు. కానీ ఆ తర్వాత సొంత పార్టీ నేతలతోనే కేశినేని నానికి విభేదాలు ఏర్పడ్డాయి.
నాని వ్యవహార శైలి నచ్చని టీడీపీ అధిష్టానం ఆయన సోదరుడు చిన్నిని ప్రోత్సహించడం ప్రారంభించింది, ఇది సహించలేకపోయిన కేశినేని నాని గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ సోదరుడు చిన్ని చేతిలో ఓడిపోయి తీవ్ర మనస్తాపంతో రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే ఈ మధ్య విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్లో కేశినేని నాని మళ్లీ యాక్టివ్ అయ్యారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. దీంతో కేశినేని నాని మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని.. వచ్చే ఎన్నికల కోసం ఎప్పటినుంచి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని టాక్ ప్రారంభమైంది.
ఈసారి కేశినేని నాని ఏ పార్టీలో చేరుతారు అన్న చర్చ కూడా మీడియాలో జరుగుతుంది. అయితే తాజాగా తన పొలిటికల్ రీఎంట్రీపై కేశినేని నాని కీలక ప్రకటన చేశారు. సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన నాని.. గత ఏడాది జూన్ 10న రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాను ఈ నిర్ణయం ఎప్పటికీ మారదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోనే ఉండాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
తన రాజకీయ పునరాగమనంపై మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తమని నాని తేల్చి చెప్పారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని.. ప్రజల అభివృద్ధి, శ్రేయస్సుకు అన్ని విధాలుగా సహకరించడంపైనే దృష్టి పెడతానని అన్నారు. సమాజానికి తన సేవ ఏ రాజకీయ పార్టీతో లేదా పదవితో ముడిపడి లేదని నాని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రజాసేవ అనేది జీవితాంత నిబద్ధత అని, కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఉంటుందని కేశినేని పేర్కొన్నారు.