టీడీపీకి విజయవాడ ఎంపీ కేశినేని కొంతకాలంగా అంటీముట్టనట్లుగా ఉంటోన్న సంగతి తెలిసిందే. పార్టీ కార్యక్రమాలతోపాటు, అధినేత చంద్రబాబుతో కూడా నానిక దూరంగా ఉంటున్నారన్నది బహిరంగ రహస్యమే. తాను రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోనని, రాజకీయాలు తనకు సూట్ కావని నాని పదే పదే చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన సోదరుడు కేశినేని చిన్ని రంగంలోకి దిగి…రాబోయే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్ ఆశిస్తుున్నారు.
అయితే, తనపై తన సోదరుడు ఇప్పటి నుంచే పోటీకి దిగడం, చిన్ని కారుపై ఎంపీ అనే స్టిక్కర్ వేసుకొని తిరగడం, నాని వ్యతిరేక వర్గాలతో చిన్ని భేటీ కావడం వంటి పరిణామాల నేపథ్యంలో కేశినేని నాని గుర్రుగా ఉన్నారు. అందుకే, స్వయానా తన సొంత తమ్ముడైన చిన్నిని తన కూతురు నిశ్చితార్థ వేడుకకు కూడా ఆహ్వానించలేదు నాని. అయితే, చిన్నికి టీడీపీ అధిష్టానం సపోర్టు ఉందని నాని గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీలో పార్టీపై, పార్టీ అధినేత చంద్రబాబుపై కేశినేని నాని తన అక్కసు, ఆగ్రహం వెళ్లగక్కారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం ప్రకారం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాల్లో పాల్గొనేదుకు టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ఢిల్లీ వెళ్లారు. తమ పార్టీ అధినేతకు ఢిల్లీ ఎయిర్ పోర్టులో టీడీపీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు స్వాగతం పలికేందుకు వెళ్లారు. వారితోపాటు నాని కూడా ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబును శాలువాతో సత్కరించిని ఎంపీలు ఆయనకు పుష్ప గుచ్చం అందించారు. ఈ క్రమంలో చంద్రబాబుకు ఇవ్వాల్సిందిగా ఎంపీ కేశినేని నాని చేతికి బొకే ఇవ్వబోయారు గల్లా జయదేవ్.
అయితే, అప్పటికే ఆగ్రహంతో, అసహనంతో ఉన్న కేశినేని నాని…జయదేవ్ ఇచ్చిన పుష్పగుచ్చాన్ని తీసుకోకుండా మీరే ఇవ్వండి అంటూ బొకే ఉన్న జయదేవ్ చేతిని తోసేశారు. అంతేకాదు, చంద్రబాబుతో మాట్లాడని నాని…ఆయనకు దూరంగా ఉండే ప్రయత్నం చేశారు. ఎయిర్ పోర్టు లాంజ్ వరకు చంద్రబాబుతో గల్లా జయదేవ్ మాట్లాడుతూ వచ్చిన సమయంలో కూడా పక్కనే ఉన్న కేశినేని నాని అసహనంగానే కనిపించారు.
అయితే, తాజాగా నాని వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. మీడియా మిత్రులు చూస్తుండగా బహిరంగ ప్రదేశంలో నాని అలా ప్రవర్తించడం సరికాదని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఏమైనా ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలని, ఇలా చంద్రబాబును బహిరంగంగా అవమానించడం ఏమిటని మండిపడుతున్నారు. కనీస సభ్యత లేకుండా నాని వ్యవహరించిన తీరుపై మండిపడుతున్నారు.