టీడీపీ సీనియర్ నేత కేశినేని నాని రాజకీయానికి అర్థం చెప్పారు. అర్థం కానిదే రాజకీయం అంటూ ఆయన కొత్త అర్థం చెప్పారు. అర్థం అయితే రాజకీయాలకు పనికి రామని విజయవాడ ఎంపీ కూడా అయిన నాని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎవరైనా సరే రాజకీయం చేస్తే అది ఇతరులకు అర్థం కాకూడదని సెలవిచ్చారు. ఒకవేళ అలా అర్థం అయితే పైకి రాలేమని కూడా చెప్పారు. రాజకీయాల్లో లెఫ్ట్, రైట్, సెంటర్ ఇలా ముందుకు సాగుతూ ఎవరికీ అర్థం కాకుండా వెళ్లాలని.. అదే అసలైన రాజకీయమని నాని చెప్పారు.
కేశినేని నాని మాటల్లాగానే ఆయన రాజకీయం కూడా అర్థం కావడం లేదని జనాలు అనుకుంటున్నారు. మొన్నటి వరకూ టీడీపీకి అంటీముట్టనట్టుగా ఉన్న నాని ఇప్పుడు సడన్‌గా చంద్రబాబు క్షేమం కోసం పోరాటం చేస్తున్నారు. పుంగనూరు ఘటనను ప్రస్తావిస్తూ ఏపీలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, వెంటనే జోక్యం చేసుకోవాలని ప్రధాని మోదీకి నాని ఫిర్యాదు చేశారు.
ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న నాని ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై విమర్శలకు పదును పెట్టడం ఆశ్చర్యంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పుడు టికెట్ భయంతోనే నాని రూట్ మార్చారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో సీటు దక్కాలంటే తిరిగి బాబుకు దగ్గరయేందుకు నాని వేస్తున్న ప్రణాళికల్లో భాగమే ఇదంతా అని విశ్లేషకులు చెబుతున్నారు.