ఇదేం రీల్ స్టోరీ కాదు రియల్ స్టోరీ. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. కేరళకు చెందిన ఒక టీనేజ్ అమ్మాయి ప్రియుడితో వెళ్లిపోయింది. ఆమె కోసం తల్లిదండ్రులు విపరీతంగా గాలించారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. వారు కూడా వెతికారు. కానీ.. ఫలితం లేకుండా పోయింది.
కాలగర్భంలో పదేళ్లు కలిసిపోయాయి. తాజాగా పోలీసుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మీ అమ్మాయి దొరికింది.. స్టేషన్ కు రమ్మనటంతో వారు పరుగులు పెడుతూ వెళ్లారు.
అక్కడకు వెళ్లిన వారు షాక్ తిన్నారు. ఎందుకంటే.. తమ కుమార్తె వెళ్లిపోయింది మరెవరితోనో కాదు పక్కింటి అబ్బాయితోనే. కాకుంటే.. ఆ అబ్బాయి ఈ మధ్య వరకు పక్కింట్లోనే ఉన్నాడు. మరి.. తమ కుమార్తె ఇంతకాలం ఎక్కడ ఉన్నట్లు? అన్నది సందేహంగా మారింది. పోలీసుల విచారణలో ప్రేమికులిద్దరూ చెప్పిన మాటలు విని అవాక్కు అయ్యారు.
తమ ప్రేమను నిజం చేసుకోవటానికి ఇంటి నుంచి వచ్చిన అమ్మాయిని.. పక్కింటి అబ్బాయివారింట్లోనే తన గదిలో ఉంచేశాడు. ఆమెకు నిత్యం అన్ని వసతులు కల్పించేవాడు. తను గదిలో ఉన్నప్పుడు సరే.. గదిలో లేనప్పుడు మాత్రం గదికి తాళం వేసుకు వెళ్లేవాడు.
ఇదంతా చదువుతున్నప్పుడు ‘ఒక్కడు’ సినిమాలో భూమికను తీసుకొచ్చిన మహేశ్ బాబు ఇంట్లో దాచి పెట్టిన వైనం గుర్తుకు రాక మానదు. అయితే.. ఆ గదిలో అటాచ్డ్ బాత్రూం లేదు. దీంతో రాత్రి వేళలో ఆ అమ్మాయిని కిటికీ నుంచి బయటకు దూకి బాత్రూం వెళ్లేది.
ఇలాంటి జీవితం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదేళ్లు సాగించారు. ఈ మధ్యనే ఆ అబ్బాయిని అమ్మాయిని తీసుకొని వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యాడు. అక్కడే సహజీవనం మొదలు పెట్టాడు. ఇంటి నుంచి కొడుకు వెళ్లిపోయి వేరే ఇంట్లో అమ్మాయితో ఉన్నాడంటూ వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయటంతో పదేళ్ల నాటి మిస్సింగ్ స్టోరీఒక కొలిక్కి వచ్చింది.
ఈ స్టోరీలో కీలకంగా ఉన్న.. ఒక గదిలోనే ఆ అమ్మాయి అన్నేళ్లు ఉండటం.. ఇంట్లో ఉన్న వారికే కాదు.. పక్కింట్లో తన తల్లిదండ్రులకు కూడా తెలీనంత రహస్యంగా ఉన్న వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఈ ఉదంతం స్థానికంగా సంచలనమైంది.