తెలంగాణలో నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు డీల్ వ్యవహారం దేశ రాజకీయాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. బిజెపికి చెందిన కొందరు వ్యక్తులు ఆ నలుగురిని కొనేందుకు సంప్రదింపులు జరిపారని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే వారిని అదుపులోకి తీసుకున్న సిబిఐ అధికారులు ప్రస్తుతం వారిని విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు.
ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాలు చేయబోయి బిజెపి అడ్డంగా దొరికిపోయిందని విమర్శలు గుప్పించారు. తెలంగాణ తరహాలోనే ఢిల్లీలోని ఆప్ ఎమ్మెల్యేల కొనుగోలుకు కూడా కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యేకు 25 కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తూ ప్రలోభ పెడుతున్నారని షాకింగ్ ఆరోపణలు చేశారు. హైదరాబాద్ ఫామ్ హౌస్ లో స్ట్రింగ్ ఆపరేషన్ వల్ల ఆ నిందితులు దొరికిపోయారని అన్నారు.
అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్ బయటపెట్టిన వీడియోలో తమ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన వ్యవహారం కూడా బట్టబయలు అయిందని అన్నారు. 41 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, ఒక్కొక్కరికి పాతిక కోట్లు ఆఫర్ చేసినట్టుగా ఆ వీడియోలో నిందితులు స్పష్టంగా చెప్పారని కేజ్రీ అన్నారు. ఢిల్లీ ప్రభుత్వం త్వరలోనే పడిపోబోతుందని నిందితులు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తుందని, దీనికి హైదరాబాద్ ఫామ్ హౌస్ ఎపిసోడ్ సాక్ష్యం అని అన్నారు.