ప్రస్తుతం దేశంలో ఉన్న సీఎంలలో ది బెస్ట్ ఎవరని అడిగితే…చాలామంది యువత ఠక్కున చెప్పే సమాధానం కేజ్రీవాల్. ఢిల్లీ సీఎంగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కేజ్రీవాల్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. అన్నా హజారే అనుచరుడిగా ఉన్న కేజ్రీ…ఉద్యమం నుంచి బయటకు వచ్చి రాజకీయ ప్రయాణం మొదలుబెట్టి సీఎం పీఠాన్ని అధిష్టించారు. ఓ మాజీ ఐఆర్ ఎస్ అధికారి సీఎం అయితే ఏం చేయగలరో నిరూపించారు.
తన హయాంలో ఢిల్లీలోని పాఠశాలల రూపురేఖలు మార్చిన కేజ్రీవాల్..దేశంలోని మరెందరో సీఎంలకు ఆదర్శంగా నిలిచారు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ పాలిస్తోన్న ఢిల్లీ అరుదైన ఘనత దక్కించుకుంది. ఒక్క రూపాయి అప్పు లేని రాష్ట్రంగా ఢిల్లీకి గుర్తింపు లభించింది. కేజ్రీవాల్ పగ్గాలు చేపట్టినప్పుడు అప్పుల ఊబిలో ఉన్న ఢిల్లీని…అసలు అప్పే లేని స్టేట్ గా తీర్చిదిద్దడం విశేషం. ఓ పక్క కరోనా కోరల్లో చిక్కి అన్ని రాష్ట్రాలు అప్పు చేసి పప్పుకూడు పెడుతుంటే..కేజ్రీ మాత్రం అందుకు భిన్నంగా అప్పులే లేని రాష్ట్రంగా ఢిల్లీని తీర్చిదిద్దారు.
ఢిల్లీలో అన్ని వ్యాధులకూ ప్రజలకు వైద్య సేవలు , 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఉచితం, అన్ని ప్రభుత్వ పాఠశాలూ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు. కొన్ని రాష్ట్రాలు అప్పులు చేసి సంక్షేమ పథకాల పేరిట పప్పుబెల్లాలు పంచుతున్నాయని, అలా చేయడం బ్యాడ్ పాలిటిక్స్ అని కేజ్రీవాల్ కామెంట్ చేశారు. ఆ కామెంట్ ను బట్టి అప్పు వల్ల ప్రజలపై, భావి తరాలవారిపై అప్పుల భారం ఎంత ఉంటుందో కేజ్రీకి స్పష్టమైన అవగాహన ఉందని తెలుస్తోంది.
మరి, అప్పుల ఊబిలో మెడదాకా కూరుకుపోయిన జగన్ …కేజ్రీవాల్ ను చూసి కొంతైనా నేర్చుకుంటే ఏపీ బాగుపడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో జగన్ పై విమర్శలు వస్తున్నాయి. జగన్ అప్పు అంటోంటే…కేజ్రీవాల్ తప్పు అంటున్నారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. జగన్ ఉచిత పథకాలపై కేజ్రీవాల్ క్రేజీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.