ఈ మధ్యే తెలుగులో ఒక ఆశ్చర్యకర ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. అగ్ర దర్శకుడు సుకుమార్, సెన్సేషనల్ యంగ్ హీరో విజయ్ దేవరకొండల ఆసక్తికర కలయికలో కొన్ని రోజుల కిందటే కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి నిర్మాతగా కేదార్ సెలగంశెట్టి అనే కొత్త పేరు తెరపైకి వచ్చింది.
ఈ పేరు ఇండస్ట్రీలో ఇంతకుముందెన్నడూ విననిది. అతడికి నిర్మాతగా ఇదే తొలి చిత్రం. ఓ కొత్త నిర్మాత ఈ సంచలన కలయికలో సినిమాను నిర్మించబోతుండటం ఆసక్తి రేకెత్తించింది. ఇంతకీ ఎవరీ కేదార్ అంటూ ఆరాలు మొదలయ్యాయి. అతను అల్లు అర్జున్‌కు క్లోజ్ ఫ్రెండ్ అన్న సంగతి వెలుగులోకి వచ్చింది.
తన స్నేహితులు, అసిస్టెంట్లకు అవకాశాలు కల్పించి వాళ్లను పెద్ద స్థాయికి తేవడానికి బన్నీ ముందు నుంచి గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. అతడి వల్ల ఇలా చాలామంది బాగు పడ్డారు.ఈ క్రమంలోనే కేదార్ కూడా తెరపైకి వచ్చాడు. విశేషం ఏంటంటే.. ఈ యువ నిర్మాత సంస్థ పేరే.. బన్నీ కారవాన్ మీద ఉంటుంది. ఫాల్కన్ క్రియేషన్స్ పేరుతో కొత్త సంస్థను నెలకొల్పి విజయ్-సుక్కు సినిమాను అనౌన్స్ చేశాడు కేదార్.
ఆ మధ్య బన్నీ ఎంతో లగ్జీరియస్‌గా ఒక కారవాన్‌ను తీర్చిదిద్దుకుని దాని ఫొటోలు మీడియాకు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ కారవాన్ ముందు ఫాల్కన్ అనే రాసి ఉంటుంది. మరి దాని డిజైనింగ్‌లో కేదార్ కీలకంగా వ్యవహరించాడా.. లేక దాన్ని బన్నీకి గిఫ్టుగా ఇచ్చాడా అన్నది ఆసక్తికరం. అందుకు బదులుగానే బన్నీ ఈ సినిమా సెట్ చేయించాడేమో అని కూడా సందేహాలు కలుగుతున్నాయి.
కేదార్ కొత్తగా ప్రొడక్షన్లోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో అతణ్ని తన ఇంటికి పిలిపించుకుని అభినందిస్తూ ఫొటోలు కూడా రిలీజ్ చేసి తనకు మీడియాలో హైప్ వచ్చేలా కూడా చూస్తున్నాడు బన్నీ. ఈ సినిమాతో ఇటు కేదార్‌కే కాక అటు సుకుమార్, విజయ్‌లకూ వాటాల రూపంలో భారీగానే ముట్టేలా ప్లానింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా కేదార్‌కు స్పోర్ట్స్ బార్స్ చైన్‌తో పాటు మరికొన్ని వ్యాపారాలున్నట్లు సమాచారం.