పార్టీ సర్వ సభ్య సమావేశమని తెలంగాణ భవన్ కు పిలిచిన గులాబీ బాస్ కేసీఆర్ .. ఎమ్మెల్యేలకు దిమ్మ తిరిగే వార్నింగ్ ఇచ్చేశారు. ఎమ్మెల్యేలు ఏమేం చేస్తున్నారో తనకు తెలుసని.. దళితబంధు ఇవ్వటానికి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్న విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు.. అందరి చిట్టా తన వద్ద ఉందని.. ఎవరేం చేస్తున్నారో తనకు తెలుసన్న ఆయన.. ‘ఇదే చివరి వార్నింగ్. మారకపోతే టికెట్ కట్ చేస్తా. అవినీతికి పాల్పడేటోల్ల తోకలు కట్ చేస్తా. వాళ్లు ఇకపై పార్టీలో కూడా ఉండరు’ అని స్పష్టమైన వార్నింగ్ ఇచ్చేశారు.
సొంత జాగాలో ఇళ్లు కట్టుకునే వారికి రూ.3 లక్షలు ఇచ్చే పథకం.. దళితబంధు.. గొర్రెల పంపిణీ.. పోడు భూముల పట్టాలు.. 58, 59 జీవోల ప్రకారం క్రమబద్ధీకరణ.. పేదలకు లబ్థి చేకూరే పథకాలపై క్రమశిక్షణతో వ్యవహరించాలని చెప్పిన కేసీఆర్.. ఇందులో ఏ మాత్రం తేడా వచ్చిన కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేవారు. హైదరాబాద్ లో నోటరీ భూముల్ని కూడా క్రమబద్ధీకరిద్దామని.. కొత్త సెక్రటేరియట్ లో ఈ ఫైళ్లపై సంతకం చేస్తానని పేర్కొన్నారు. ఎన్ని కష్టాలువచ్చినా దళితబంధు పథకం కొనసాగుతూనే ఉంటుందన్న క్లారిటీ ఇచ్చేశారు.
ఎమ్మెల్యే అనుచరులు వసూళ్లు చేసినా.. వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసిన కేసీఆర్.. బాగాపని చేస్తున్న ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు ఇస్తామని చెప్పారు. దళిత బంధుకింద రూ.10 లక్షలు సాయం చేస్తుంటే.. అందులోలంచనాలు తీసుకోవటం ఏమిటని ప్రశ్నించిన కేసీఆర్.. అక్టోబరులోనే ఎన్నికలు జరుగుతాయి కాబట్టి.. మారని వారికి నష్టం తప్పదని స్పష్టం చేశారు. పార్టీ ఖాతాలో రూ.1250 కోట్ల నిధులు ఉన్నాయని.. వాటిల్లో రూ.767 కోట్లు డిపాజిట్ చేశామని.. దీంతో నెలకు రూ.7 కోట్ల వడ్డీ వస్తుందన్నారు. ఆ మొత్తంతో పార్టీని నడపటం.. జిల్లాల్లో ఆపీసుల నిర్మాణాలు.. ప్రచారం.. వసతుల కల్పన కోసం ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు.
పార్టీ ఆర్థిక వ్యవహారాల్ని అధ్యక్షుడే చూసుకుంటారని.. ఇతర రాష్ట్రాల్లో ఖాతాలు ఓపెన్ చేయటం.. ప్రచారం కోసం దేశ వ్యాప్తంగా మీడియా వ్యవస్థల ఏర్పాటు.. ఇతర వ్యవహారాలను పార్టీ జాతీయ అధ్యక్షుడికి కట్టబెడుతూ తీర్మానం చేశారు. బీఆర్ఎస్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకుఅవసరమైన టీవీ చానల్ ఏర్పాటు చేస్తామని చెప్పటం ద్వారా.. ఇంగ్లిషు.. హిందీ న్యూస్ చానల్ దిశగా అడుగులు పడుతున్నట్లుగా చెప్పాలి.