ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ప్రముఖుడు నోటి నుంచి వచ్చే వ్యాఖ్యలకు ఉండే విలువ గురించి తెలిసిందే. పూర్తిగా నిజాలు చెప్పకున్నాఫర్లేదు కానీ.. నోటికి వచ్చినట్లుగా అబద్ధాలు కూడా చెప్పటం భావ్యం కాదు. మరి.. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా మర్చిపోయారు. అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తాజాగా మహారాష్ట్రకు చెందిన షెట్కారీ సంఘటన్ కు చెందినరైతు సంఘాల నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరిన నేపథ్యంలో తెలంగాణ భవన్ లోముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు సున్నాకు సున్నాగా తేల్చేశారు. తెలంగాణ ఏర్పాటు ముందు రైతుల ఆత్మహత్యలు ఉండేవని.. తమ ప్రభుత్వంలో ఆ సమస్యను అధిగమించినట్లుగా పేర్కొన్నారు. తెలంగాణలో ప్రస్తుతం జీరో గా రైతుల ఆత్మహత్యలు ఉన్నట్లుగా సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీశారు.
ఈ సందర్భంగా తమ ప్రభుత్వం సాధించిన ఘనతల్ని ఏకరువు పెట్టారు.ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ గణాంకాల్ని ఆయన ఉటంకిస్తూ.. తాను చెప్పిన విషయాలన్ని కేంద్రం ఇచ్చిన నివేదికలే స్పష్టం చేస్తాయని పేర్కొన్నారు. .ఇదంతా వినేందుకు బాగానే ఉన్నా.. క్రాస్ చెక్ చేస్తే పరిస్థితి ఏమిటి? అన్నది ప్రశ్న. మిగిలిన విషయాలు కేంద్రం ప్రకటించిందన్న ఆయన.. ఆత్మహత్యల విషయంలో కొంతకాలం క్రితం (దాదాపు రెండు నెలల కంటే తక్కువసమయంలోనే) పార్లమెంటులో కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ.. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు చాలామేర తగ్గాయని పేర్కొన్నారేకానీ.. అసలు లేవన్న విషయాన్ని చెప్పలేదు.
నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూర్ నివేదిక ప్రకారం తెలంగాణలో రైతుల ఆత్మహత్యల సంఖ్య 2017లో 846 ఉంటే.. 2018లో 900 ఉందని.. 2019లో 491, 2020లో 466, 2021లో 352కుతగ్గినట్లుగా పేర్కొంటూ వివరాల్ని వెల్లడించారు. మరి..అందుకు భిన్నంగా తెలంగాణలో సున్నా రైతుఆత్మహత్యలు అన్న కేసీఆర్ మాటపై విపక్షాలు విరుచుకుపడటం ఖాయమంటున్నారు. దీనికి తోడు తమ సొంత మీడియా సంస్థలోనూ ఇదే విషయాన్ని ప్రముఖంగా ప్రచురించినట్లుగా చెబుతున్నారు.
ఒకవేళ.. వ్యవసాయ మంత్రిచేసిన వ్యాఖ్యల్లో తప్పు ఉంటే.. ఈ పాటికి తమ వాదనను భారీగా అచ్చేవారు. అలా కాకుండా ఉన్నారంటే.. రైతుల ఆత్మహత్యల సంఖ్య విషయంలో గులాబీ బాస్ నోటి నుంచి వచ్చిన మాటతో ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.