చెప్పే మాటలకు.. చేసే పనులకు ఏ మాత్రం పొంతన లేని రీతిలో వ్యవహరించటం గులాబీ బాస్ కేసీఆర్ కు అలవాటే. కేంద్రంలోని మోడీ సర్కారు తన రాజకీయ ప్రత్యర్థుల్ని దారికి తెచ్చేందుకు ఈడీ.. సీబీఐని ఉసిగొల్పుతుందని.. తనిఖీలు చేపట్టటం.. కేసులు నమోదు చేయటం ద్వారా వైరి వర్గాన్ని నియంత్రణలోకి తెచ్చుకోవటం అలవాటుగా మారిందంటూ మండిపడిన కేసీఆర్.. తన రాజకీయ ప్రత్యర్థుల విషయంలో అదే బాటలో పయనిస్తానన్న విషయాన్ని మర్చిపోవటం ఏమిటి? తాను ఏం చెప్పినా.. ప్రజలు వినటమే కాదు.. నమ్మేస్తారన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి.
సోమవారం సాయంత్రం ప్రెస్ మీట్ లో కేంద్రంలోని మోడీ సర్కారును ఒక రేంజ్ లో విరుచుకుపడటం తెలిసింది. అన్ని ఘాటు విమర్శలు చేసిన కేసీఆర్.. ఎక్కడా మోడీ పేరును కానీ అమిత్ షా పేరును కానీ ప్రస్తావించకుండా ఉండటం కేసీఆర్ కే చెల్లుతుంది.
తనను టార్గెట్ చేస్తున్న బండి సంజయ్ మీద తీవ్రంగా విరుచుకుపడిన ఆయన.. ఢిల్లీ అధినేతల పేర్లను మాత్రం నేరుగా ప్రస్తావించకపోవటం గమనార్హం. తన మాట వినని వారిని దారికి తెచ్చేందుకు ఈడీని.. సీబీఐని ప్రయోగించటం కేంద్రానికి అలవాటుగా మారిందని.. తాను నికార్సు రాజకీయాల్ని చేస్తుంటానని.. తప్పు చేయటం తన ఇంటా వంటా లేదని చెప్పే కేసీఆర్ తనను ఎవరూ ఏమీ చేయలేరని చెప్పుకోవటం ఎక్కువైంది.
రాజకీయ ప్రత్యర్థులపై కేసులు బనాయించి దారికి తెచ్చుకోవాలనే పప్పులు తన దగ్గర చెల్లవన్న కేసీఆర్ మాటలకు.. చేతలకు ఏ మాత్రం పొంతన లేదన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. కేంద్రాన్ని ఈడీ పేరుతో విమర్శించే కేసీఆర్.. తన వరకు తాను ఇదే బాటలో పయనిస్తున్నారన్న విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు.
ఎక్కడిదాకానో ఎందుకు.. సోమవారం సాయంత్రం నాలుగు గంటల వేళ మీడియాతో సమావేశానికి కాస్త ముందుగా.. ఈటల కుటుంబ సభ్యులకు నోటీసులు అందచేసిన వైనాన్ని ఏమని చెప్పాలి? ఈటల నిజంగానే అన్ని తప్పులుచేసి ఉంటే.. గడిచిన ఏడున్నరేళ్లుగా ఎందుకు మౌనంగా ఉన్నట్లు? అన్న ప్రశ్నకు కేసీఆర్ ఏం సమాధానం చెబుతారు?
ఈటల విషయాన్ని కాస్త పక్కన పెడితే.. తీన్మార్ మల్లన్న విషయంలోనూ ఇలాంటి పరిస్థితి. సీఎం కేసీఆర్ తప్పుల్ని రోజువారీగా తన యూట్యూబ్ ఛానల్ లో విరుచుకుపడే తీన్మార్ మల్లన్నపై దాదాపు రెండు డజన్ల కేసులు పెట్టటం.ఐదు వారాలుగా జైల్లో ఉంచటం దేనికి సంకేతం? అని ప్రశ్నిస్తున్నారు.
ఓ వైపు కేంద్రం తన మాట వినని వారిపై ఈడీతో దాడులు చేయిస్తుందని ఆరోపించే కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రంలో తన వైరి వర్గంగా పేరున్న ఈటల..తీన్మార్ మల్లన్న విషయంలో జరుగుతున్నదేమిటి? అన్న ప్రశ్నను పలువురు సంధిస్తున్నారు. ఈ రెండు ఉదాహరణలు చాలు..కేసీఆర్ చెప్పే మాటలకు ఏ మాత్రం సంబంధం లేని రీతిలో వాస్తవాలు ఉంటాయంటున్నారు.