షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వచ్చేకొద్ది అన్నీ పార్టీలు ఇతర పార్టీల్లోని గట్టినేతలపై దృష్టిపెట్టాయి. పార్టీల అధినేతలపై అసంతృప్తిగా ఉన్న నేత లు, టికెట్లు రావని కన్ఫర్మ్ చేసుకున్న గట్టి నేతలను ఏదో విధంగా తమ పార్టీల్లోకి లాక్కోవాలని పార్టీ అధినేతల ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఇందులో భాగంగానే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కాంగ్రెస్ సీనియర్ నేత పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. దీనికి కారణం ఏమిటంటే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెకంటరెడ్డితో సదరు నేతకు పడకపోవటమేనట.
ఉమ్మడి నల్గొండ, ఖమ్మ, మెదక్, గ్రేటర్ హైదరాబాద్ లోని అసంతృప్త నేతలపై కేసీయార్ దృష్టిపెట్టినట్లు సమాచారం. రాబోయే ఎన్నికల్లో నల్గొండ, ఖమ్మం, మెదక్, గ్రేటర్ హైదరాబాద్ లో అత్యధిక సీట్లను గెలుచుకోవటమే వ్యూహంగా కేసీయార్ పావులు కదుపుతున్నట్లు సమాచారం. నిజానికి నల్గొండ, ఖమ్మంలో బీఆర్ఎస్ బాగా వీకన్న విషయం తెలిసిందే. అందుకనే కాంగ్రెస్ నేతలపై టార్గెట్ పెట్టారట. ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లోని నేతలతో కూడా బీఆర్ఎస్ నేతలు టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
టికెట్ ఇవ్వగలిగిన వాళ్ళకి టికెట్ల హామీలు ఇస్తున్నారని, అవి సాధ్యంకానపుడు నామినేటెడ్ పోస్టులు, ఇతరత్రా అవసరాలను చూసుకుంటామని కేసీయార్ హామీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి కేసీయార్ హామీలను నమ్ముకుని ఇతర పార్టీల్లోని నేతలు ఎంతమంది కారు ఎక్కుతారో చూడాలి. ఎందుకంటే ఇప్పటికైతే బీఆర్ఎస్ పై జనాల్లో బాగా వ్యతిరేకత కనబడుతోంది.
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అంటే జనాల్లో ఊపుకనబడుతోంది. కర్నాటకలో కాంగ్రెస్ ఘనవిజయం సాదించిన ప్రభావం తెలంగాణాలో కూడా పడింది. దాంతోనే సీనియర్లందరు మంచి జోష్ తో పనిచేస్తుంటే క్యాడర్లో కూడా ఉత్సాహం రెట్టింపయ్యింది. ఇదే సమయంలో బీజేపీ చప్పబడిపోవటం కాంగ్రెస్ కు బాగా కలిసొచ్చింది. ఈ సమయంలో కూడా కాంగ్రెస్ లోని అసంతృప్త నేతలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. కరీనంగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా బీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం పెరిగిపోతోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.