తాము చేసే పనిని అవతలోడు చేస్తే ఎక్కడో కాలిపోతుంటుంది. అది మనిషి స్వభావం. తిట్టినా.. కొట్టినా.. అందుకు భిన్నంగా పెట్టినా తాను మాత్రమే చేయాలే కానీ మరెవరూ అలాంటివి చేయడానికి ఇష్టపడని వ్యక్తులు మనకు తారస పడుతుంటారు. కానీ.. అలాంటి తీరున్న వారు పాలకులుగా మారితే వచ్చే తలనొప్పి అంతా ఇంతా కాదు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాజకీయ జీవితంలో ఎన్నోఆటు పోట్లను ఎదుర్కొని.. రిటైర్మెంట్ కు దగ్గరకు వచ్చేస్తున్నానే అన్న వేళలో.. ఆయన సుడి ఒక్కసారిగా తిరిగి పోవటమే కాదు.. తిరుగులేని అధినేతగా ఆయన ఎదిగిన క్రమం సమకాలీన రాజకీయాల మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిందే.
అలాంటి కేసీఆర్.. తాను తెలంగాణ రాష్ట్రంలో చేసిన పనిని.. కేంద్రంలో మోడీ చేస్తుండటాన్ని ఆయన తల్లడిల్లిపోతున్నారు. ఇంత దారుణమా? అంటూ విస్మయానికి గురవుతున్న ఆయన.. తాను చేసిన పనినే మోడీ కూడా చేస్తున్నారన్న విషయాన్ని మాత్రం గుర్తించేందుకు అస్సలు ఇష్టపడటం లేదని చెప్పాలి.
తాజాగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన నోటి నుంచి వచ్చిన మంచి ముత్యాల్ని కాసిన్ని ఏరుకొంటే మంచిది. అలాంటి ముత్యాల్లో ఒకదాన్ని చూస్తే.. ‘‘ఓట్ల కోసం భారతీయ సమాజాన్నే గోస పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏం కావాలని బీజేపీ ఈ గడబిడ చేస్తోంది? నరేంద్ర మోడీ.. మీకు ప్రధాని పదవి చాలదా? ఇంకాఏం కావాలని ఆగమాగం చేస్తున్నారు. అంతకంటే పెద్ద పదవి ఏం లేదు కదా? బీహార్.. ఢిల్లీ.. బెంగాల్ లో ఏం జరుగుతోంది? తెలంగాణలో ఎలాంటి కారుకూతలు కూస్తున్నారు. అందరూ గమనించాలి’’ అంటూ ఆయన నిప్పులు చెరిగారు.
కేసీఆర్ మాటల్లో దొర్లిన మంచి ముత్యాల్ని ఒకటి తర్వాత ఒకటి జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. గడిచిన కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో తాను చేస్తున్న పనినే.. కాస్తంత పెద్దది చేసి కేంద్రంలోని మోడీ సర్కారు చేస్తుందన్న వాస్తవాన్ని.. ఇంత పెద్ద వయసులో కేసీఆర్ గుర్తు పెట్టుకోవటం కష్టమే.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత.. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఓట్లేసి గెలిపించిన సీట్లు ఎన్ని? 2018 ఎన్నికల నాటికి టీఆర్ఎస్ పార్టీ బలం ఎంత పెరిగింది? ఎమ్మెల్యేలు ఎంతమంది పెరిగారు? వారంతా పార్టీలోకి ఎలా వచ్చారు? ఆ సందర్భంగా సీఎం కేసీఆర్ ఏం చెప్పారు? లాంటి ప్రశ్నల్ని వేసుకొని.. మెదడును గతంలోకి వెళ్లి రమ్మని చెబితే.. అది తన వెంట చాలానే విషయాల్ని మోసుకొస్తుందన్నది మర్చిపోకూడదు.
తెలంగాణలో టీఆర్ఎస్ ను తిరుగులేని శక్తిగా మార్చేందుకు వీలుగా వైసీపీతో మొదలు పెట్టి.. తెలుగుదేశం.. కాంగ్రెస్ పార్టీల్లోని ఎమ్మెల్యేల్లో పలువురిని గులాబీ కారు ఎక్కించేసిన వైనాన్ని కేసీఆర్ ఎలా మర్చిపోతారు. తన పార్టీ విస్తరణను అప్పట్లో బంగారు తెలంగాణ లక్ష్యమని చెప్పటం మర్చిపోయారా? పార్టీని విస్తరించే విషయంలో కేసీఆర్ పీజీ చేస్తే.. నరేంద్ర మోడీ పీహెచ్ డీ చేశారన్న విషయాన్ని గులాబీ బాస్ ఎందుకు మర్చిపోతున్నారు?
ప్రధానమంత్రి పదవి చాలాదా? అంటూ అడిగేస్తున్న ఆయన.. తన జీవితకాలంలో తెలంగాణ వస్తే చాలు.. మరే పదవీ వద్దంటూ ఉద్యమసమయంలో చెప్పిన పెద్ద మనిషి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారాన్ని సొంతం చేసుకోవాలని.. అది కాస్తా చేతికి వచ్చాక.. మిగిలిన పార్టీలేవీ ఉండొద్దన్న లక్ష్యంతో ఎంతలా పావులు కదిపారో.. అందుకు ఎన్నేసి వ్యూహాలు పన్నారా? పార్టీలను బలహీన పర్చి.. ఆ తర్వాత ఉనికే లేకుండా చేసిన గతాన్ని గుర్తు తెచ్చుకోవటానికి కేసీఆర్ కు ఇష్టం లేకుండా ఉండొచ్చు. అంతమాత్రాన కాలం గతాన్ని మర్చిపోదు కదా?
తెలంగాణలో తానెప్పుడో చేసిన పనిని.. కేంద్రంలో తిరుగులేని పట్టును సాధించిన మోడీ.. ఇప్పుడు యావత్ దేశమంతా కాషాయ పార్టీనే అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారు. అందుకు కేసీఆర్ మాదిరి పావులు కదుపుతున్నారు. ఆయన కంటే ముతగ్గా మోడీ తీరు ఉందే తప్పించి.. మిగిలినదంతా సేమ్ టు సేమ్ అన్నది మర్చిపోకూడదు.
తెలంగాణ మొత్తంగా కమ్మేసే క్రమంలో మిగిలిన పార్టీల్ని లేవకుండా కుమ్మేసిన ఘన చరిత్ర ఉన్న కేసీఆర్ ఇప్పుడు గుండెలు బాదుకోవటమా?అన్నది అసలు ప్రశ్న. తనకు అవసరం ఉన్న వేళలో దేనికైనా సై అన్నట్లుగా వ్యవహరించి.. తనకు ఇబ్బంది ఎదురైన వేళలో మాత్రం విలువల గురించి మాట్లాడటం ఎబ్బెట్టుగా అనిపించదా కేసీఆర్?