తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మరోమారు తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇలాకా అయిన హుజురాబాద్ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇక్కడ త్వరలో జరగబోతున్న ఉప ఎన్నికను ఎదుర్కునేందుకు గేమ్ మొదలు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయబోతున్న దళిత సాధికారత పథకానికి.. “తెలంగాణ దళిత బంధు” అనే పేరును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఖరారు చేశారు. మొదటగా, పైలట్ ప్రాజెక్టు కింద ఒక నియోజక వర్గాన్ని ఎంపిక చేసి, ‘తెలంగాణ దళిత బంధు’ పథకాన్ని అమలును ప్రారంభించాలని సమావేశం నిర్ణయించింది. అందులో భాగంగా పైలట్ నియోజకవర్గంగా కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజవర్గాన్ని ఎంపిక చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన ప్రకారం, ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో అనేక కార్యక్రమాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లానుంచే ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమానికి నాందిగా నిర్వహించిన సింహగర్జన సభ మొదలకొని, తాను ఎంతగానో అభిమానించిన రైతు బీమా పథకం దాకా కరీంనగర్ జిల్లా నుంచే సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అదే విధంగా ప్రతిష్టాత్మకమైన రైతుబంధు పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కేంద్రంగానే ప్రారంభించారు. అదే ఆనవాయితీని, సెంటిమెంటును కొనసాగిస్తూ…‘తెలంగాణ దళిత బంధు’ పథకాన్ని కూడా హుజూరాబాద్ నుంచే ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ప్రారంభోత్సవ తేదీని త్వరలో సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారు.
తెలంగాణ దళిత బంధు పథకం హుజురాబాద్ నుంచే ప్రారంభించేందుకు కారణంగా కేవలం ఆనవాయితీ కాదన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గులాబీ దళపతి హుజురాబాద్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. అలాంటి ప్రతిష్టాత్మక నియోజకవర్గంలో దళితుల ఓట్లు దాదాపు 40000 వరకు ఉన్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో భారీగా ఉన్న ఈ ఓట్లను ప్రభావితం చేసేలా తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఈటల బీసీ కార్డు ప్రయోగిస్తే తమ తరఫున దళితకార్డును విసిరేందుకు సీఎం కేసీఆర్ ఈ గేమ్ ప్లే చేస్తుండవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.