రాజకీయాల్లో శాశ్విత శత్రువులు.. శాశ్విత మిత్రులు అంటూ ఎవరూ ఉండరు. అవసరం.. అవకాశం మాత్రమే రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తుంటాయి. ఈ మాటలు ఎంత నిజమన్న విషయాన్ని గడిచిన రెండు రోజులుగా తెలంగాణ అధికార పక్షం చేస్తున్న ప్రయత్నాలు చూస్తే అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత కూడా.. తాజా ఎన్నికల్లోనూ సెంటిమెంట్ ను రగిలించేందుకు ఆంధ్రా బాణాన్ని బయటకు తీసి.. దాన్నో బూచిగా చూపిస్తూ సీఎం కేసీఆర్ చేసే వ్యాఖ్యల్ని చూస్తున్నదే. ఆయన చెప్పే మాటల్లో నిజాలేమిటి? అబద్ధాలేమిటి? అన్న దానిపై ఏపీకి చెందిన ఏ ఒక్క రాజకీయ నేత మాట్లాడలేని పరిస్థితి.
ఇదిలా ఉంటే.. మరోవైపు ఆంధ్రోళ్లను తిట్టేస్తూ.. వారిపై అవాకులు చవాకులు పేలుతున్న కేసీఆర్ తీరు ఒకలా ఉంటే.. మరోవైపు ఆయన కుమారుడు కమ్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న కేటీఆర్ తీరు మరోలా ఉంది. రెండు రోజుల క్రితం ఒక ప్రముఖ చానల్ అధినేతతో ప్రత్యేక ఇంటర్వ్యూకు వచ్చిన కేటీఆర్.. దాదాపు రెండున్నర గంటల పాటు లైవ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ మొత్తం ఇంటర్వ్యూను అసాంతం చూసిన తర్వాత రెండు విషయాలు అర్థమవుతాయి. అందులో ప్రధానంగా బింకంగా.. ఎన్నికల్లో గెలుపు ధీమాను ప్రదర్శిస్తున్న కేటీఆర్ మాటల్లో తెలియని సంకోచం.. ఆందోళన కనిపిస్తుంది. అదే సమయంలో ఏపీ మూలాలు ఉన్న ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలన్న తపన కనిపిస్తుంది.
ఇందుకోసం కేటీఆర్ చేసే ప్రయత్నాలకు.. సదరు మీడియా అధినేత సైతం అంతో ఇంతో సాయంగా నిలిచారని చెప్పాలి. ఏపీ ప్రజల అభిమానాన్ని పొందేందుకు వీలుగా కేటీఆర్ నుంచి సమాధానాలు రాబట్టటంలో సక్సెస్ కావటం కనిపిస్తుంది. అంతేనా.. చంద్రబాబు అరెస్టు ఎపిసోడ్ వేళ.. తాను చేసిన వ్యాఖ్యల మీద విచారం వ్యక్తం చేసేందుకు వెనుకాడలేదు కేటీఆర్. ఇదంతా చూస్తే.. కేటీఆర్ రాజకీయ పరిణితికి ముచ్చట వేయాల్సిందే. ఎక్కడ తగ్గాలన్న విషయంపై ఆయనకున్న అవగాహనను మెచ్చుకోవాల్సిందే.
మరోవైపు గులాబీ పార్టీకి చెందిన సోషల్ మీడియా టీం సైతం కొత్త తరహా ఎత్తుగడను ఫాలో అవుతుందా? అన్నది ప్రశ్నగా మారింది. ఈ రోజున సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయ్యింది. అందులో ఒక మాల వేసుకున్న స్వామి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాడు.. తెలంగాణలో సీఎంగా కేసీఆర్ కు మించిన తోపు లేడని చెప్పటమే కాదు.. ఒక్క ఛాన్స్ అంటే ఏమవుతుందో చూశారు కదా? అంటూ వ్యంగ్యస్త్రాన్ని సంధించేశారు. దీన్ని.. హైలెట్ చేసుకోవటమే కాదు.. పదేళ్లు అయ్యింది కదా అని.. అమ్మను.. నాన్నను మారుస్తామా? అంటూ స్వామి వేసిన ప్రశ్నను హైలెట్ చేసుకుంటూ వైరల్ గా మార్చటం చూస్తే.. గులాబీ దళం తెలివితేటలకు ఫిదా కావాల్సిందే.
ఓపక్క ఏపీ మూలాలు ఉన్న ఓటర్లను ప్రసన్నం చేసుకోవటం కోసం కేటీఆర్ ప్రయత్నాలు.. సోషల్ మీడియాలోనూ అదే తరహా ప్రచారం చేస్తూ సానుకూల వాతావరణం కోసం తపిస్తున్న వైనం చూస్తే.. గులాబీ పార్టీ జాణతనం ఏ రేంజ్ అన్నది ఇట్టే అర్థమవుతుంది. ఓపక్క బహిరంగ సభల్లో ఏపీని.. ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వారిని (ఎప్పటిలానే నేతలని బుకాయిస్తారనుకోండి) తిట్టేస్తూనే.. మరోవైపు అదే రాష్ట్రానికి చెందిన వారితో పొగిడించుకొని.. దాన్నివైరల్ గా మార్చుకొని లబ్థి పొందే తీరు చూస్తే.. వావ్.. వాటే స్ట్రాటజీ అనుకోకుండా ఉండలేం. ఏపీకి చెందిన ఒక స్వామి గులాబీ బాస్ కేసీఆర్ ను ఎంతలా పొగిడేశారో చిట్టి వీడియోను చూస్తే అర్థం కావటమే కాదు. గులాబీ దళం వ్యూహం ఎంత బలంగా ఉంటుందో అర్థమవుతుంది.
వెంకట రవి(ఆటో డ్రైవర్),ప్రకాశం జిల్లా!!
ఓ తెలంగాణ వీరుడా ,,ఇది విన్నాక కూడా …ఒక్క చాన్స్ ఇచ్చిచూద్దాం లే అనుకున్నావంటే??
ఇక …ఓం నమః శివాయే ????@KTRBRS #TelanganaElection2023 #KCROnceAgain #HattrickCMKCR pic.twitter.com/SMrCXtzTYl— VijaySankar (@JaiAndhra_party) November 14, 2023