యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం పూర్తయిన సంగతి తెలిసిందే. నభూతో నభవిష్యత్ అన్న రీతిలో కళ్లు చెదిరే కళాకృతులు, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయాన్ని తీర్చిదిద్దారు. ఈ క్రమంలోనే నేడు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ స్వయంభూ దర్శన ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. దివ్య విమాన గోపురంపై శ్రీ సుదర్శన చక్రానికి కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించి పవిత్ర జలాలతో అభిషేకం చేశారు.
ఈ సందర్భంగా కేసీఆర్కు కంకణధారణ చేసిన పండితులు ఆశీర్వచనం అందించారు. ఏడు గోపురాలపై ఉన్న కలశాలకు ఏకకాలంలో కుంభాభిషేకం, సంప్రోక్షణ నిర్వహించడం విశేషం. మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవం ముగిసిన తర్వాత ప్రధానాలయ ప్రవేశ కార్యక్రమం జరిగింది. ఉపాలయాల్లోని ప్రతిష్ఠామూర్తులకు మహాప్రాణన్యాసం చేశారు. ఆరాధన సంప్రోక్షణ అనంతరం గర్భాలయంలో స్వయంభువుల దర్శనం ప్రారంభమైంది
నవ్య యాదాద్రిని ముఖ్యమంత్రి కేసీఆర్ జాతికి పునరంకితం చేశారు. ప్రధాన ఆలయ ప్రవేశం, మహాకుంభ సంప్రోక్షణ క్రతువు శాస్రోక్తంగా ముగిసిన సందర్భంగా సీఎం కేసీఆర్ దంపతులను వేద పండితులు ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రముఖులు, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
ఆలయ పునర్నిర్మాణంలో పాలు పంచుకున్న ఆలయ ఈవో ఎన్ గీత, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, స్థపతి సుందర్ రాజన్, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావును సీఎం కేసీఆర్ శాలువాలతో సత్కరించి, సన్మానించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆలయ ఈవో గీత, వైటీడీఏ వైస్ చైర్మన్ శాలువాతో సత్కరించి, నారసింహ స్వామి ఫోటోను బహుకరించారు.
కాగా, ఈ కార్యక్రమంలో చిన్న అపశృతి జరిగింది. మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొన్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై తేనెటీగలు దాడి చేశాయి. ఆలయ పంచతల గోపురంపై పూజా క్రతువులో ఉన్న మంత్రి, వేద పండితులు, మంత్రి వ్యక్తిగత భద్రత సిబ్బందిపైన తేనెటీగల దాడి జరిగింది. పూజలో నిమగ్నమైన మంత్రి పైకి ఒక్కసారిగా తేనెటీగలు దూసుకొచ్చాయి. అయితే, తేనెటీగలు దాడి చేసినప్పటికీ మంత్రి పువ్వాడ అజయ్ భక్తిభావంతో మహాకుంభ సంప్రోక్షణ పూజా కార్యక్రమాన్ని కొనసాగించారు. క్రతువును ముగించుకొని హుటాహుటిన మంత్రి అజయ్ హైదరాబాద్ కు ప్రాథమిక చికిత్స కోసం బయల్దేరి వెళ్లారు.