అధికార బీఆర్ఎస్ లో డిక్లరేషన్ల భయం పెరిగిపోతున్నట్లుంది. అందుకనే అభ్యర్ధులతో పాటు పార్టీ నేతలకు, క్యాడర్ కు కూడా డిక్లరేషన్లకు వ్యతిరేకంగా జనాల్లో ప్రచారం చేయాలని పార్టీ నుండి అందరికీ సమాచారం అందుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ వివిధ వర్గాలకు డిక్లరేషన్లు ప్రకటించిన విషయం తెలిసిందే. డిక్లరేషన్లు అంటే అధికారంలోకి రాగానే చేయబోయే మేళ్ళకి హామీలు ఇవ్వటమనే.
పార్టీ నుండి మహిళ, మైనారిటిలు, బీసీలు, యువత, రైతుల పేర్లతో ప్రత్యేకంగా డిక్లరేషన్లు ప్రకటించింది. సోనియాగాంధి, ప్రియాంక, రాహుల్ గాంధి, మల్లికార్జున ఖర్గే లాంటి అగ్రనేతలను తెలంగాణాకు పిలిపించి ప్రత్యేకంగా డిక్లరేషన్లను ప్రకటింపచేసింది. ఈ డిక్లరేషన్లపై అభ్యర్ధులు, నేతలు, ప్రచారకమిటితో పాటు ప్రత్యేకంగా వ్యూహకర్తలు భారీ బృందాలతో విస్తృత ప్రచారం చేస్తోంది. దానికి తగ్గట్లే జనాల్లో కూడా డిక్లరేషన్లపై బాగా చర్చలు జరుగుతోంది.
కేసీయార్ పదేళ్ళ పరిపాలనతో కాంగ్రెస్ డిక్లరేషన్ల హామీలను జనాలు పోల్చి మాట్లాడుకుంటున్నారు. దాంతో కాంగ్రెస్ వైపు జనాల మొగ్గు కనబడుతున్నట్లు బీఆర్ఎస్ అనుమానిస్తోంది. ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా కేసీయార్ కు ఇలాంటి రిపోర్టులే ఇచ్చినట్లు పార్టీవర్గాలు చెప్పాయి. దాంతో వెంటనే అలర్టయిన పార్టీ పెద్దలు డిక్లరేషన్లకు వ్యతిరేకంగా జనాల్లో ప్రచారం చేయాలని మొబైల్ ఫోన్లలో మెసేజిలు పంపుతున్నారట.
బీఆర్ఎస్ కూడా చాలా హామీలను ఇస్తోంది. కేసీయార్ బహిరంగసభల్లో మాట్లాడుతు అధికారంలోకి వస్తే తాను చేయబోయే కార్యక్రమాలను, అమలుచేయబోయే పథకాల గురించి వివరిస్తున్నారు. అయితే జనాలేమో పదేళ్ళ పరిపాలనలో కేసీయార్ ఇచ్చిన హామీలను, వాటి అమలుతో ఇపుడిస్తున్న హామీలను పోల్చి చూస్తున్నారు. అందుకనే బీఆర్ఎస్ అభ్యర్ధులు, నేతల ప్రచారాన్ని పెద్దగా పట్టించుకోవటంలేదు. పట్టించుకోకపోవటమే కాకుండా కొన్ని గ్రామాల్లో అభ్యర్ధులు, నేతలను అసలు ప్రచారానికే అడుగుపెట్టనీయటంలేదు.
ఇక్కడ కాంగ్రెస్ గురించి మాట్లాడటానికి ఏమీలేక కర్నాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలుచేయటంలేదని పదేపదే ప్రస్తావిస్తున్నారు. దాన్ని కూడా కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యుటి సీఎం డీకే శివకుమార్, రేవంత్ అండ్ కో తిప్పికొడుతున్నారు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.