గడిచిన కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెబుతున్న జాతీయ పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయం ఒకటి తీసుకున్నారు. తెలంగాణ ప్రజలకు అతి పెద్ద పండుగైన దసరా నాడే తన తాజా కలగా మారిన జాతీయ పార్టీని అధికారికంగా ప్రకటించాలని కేసీఆర్ నిర్ణయించారు. దసరా వేళ.. మిట్ట మధ్యాహ్నం 1.19 గంటల వేళలో జాతీయ పార్టీని ప్రకటించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. అదే రోజున టీఆర్ఎస్ ఎల్పీ.. రాష్ట్ర కార్యవర్గం కూడా భేటీ కానున్నారు. పార్టీ ప్రకటన వేళ.. కొందరు జాతీయ నాయకులు కూడా హాజరయ్యే అవకాశం ఉందంటున్నారు.
కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన సమాఖ్య వ్యవస్థను ప్రధానంగా ప్రస్తావిస్తూ.. కేంద్రం పోషిస్తున్న పెద్దన్న పాత్రను ప్రశ్నించేలా తమ పార్టీ ప్రణాళికను కేసీఆర్ ప్రకటించనున్నట్లు చెబుతున్నారు. పార్టీ పేరు.. జెండా.. ఎజెండా లాంటి వాటిపై ఇప్పటికే స్పష్టత ఉన్న నేపథ్యంలో.. వీటికి సంబంధించిన ప్రకటనలన్ని అదే రోజున కేసీఆర్ వెల్లడించనున్నారు.
టీఆర్ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం టీఆర్ఎస్ పేరుకు దగ్గరగానే కేసీఆర్ జాతీయ పార్టీ పేరు ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే భారత రాష్ట్ర సమితి పేరు గురించి తెలిసిందే. దీనికి తోడుగా నవ భారత్ పార్టీ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.
పార్టీ పేరు మారినా.. పార్టీ జెండా రంగు మాత్రం.. తనకు కలిసి వచ్చిన గులాబీ రంగులోనే ఉంటుందని.. అందులో భారత దేశ మ్యాప్ ఉంటుందని చెబుతున్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్ని ప్రధానంగా తీసుకొని ఎజెండాను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.