రాబోయే ఎన్నికలలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అవుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే, తమిళనాడు సీఎం స్టాలిన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ లతో కేసీఆర్ భేటీ అయ్యారు.
ఆ నేతలతో కేసీఆర్ భేటీ కావడం ఇటు మీడియాలోనూ, అటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.
జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కేసీఆర్ పావులు కదుపుతున్న వైనంపై పలువురు రాజకీయ నేతలు ప్రశంసలు కురిపిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా కేసీఆర్ పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు. కేసీఆర్…రియల్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అంటూ వర్మ ఆకాశానికెత్తేసిన వైనం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
పాన్ ఇండియా సినిమాలుగా గుర్తింపు సాధించిన తెలుగు సినిమాలు, అందులో లీడ్ రోల్లో కనిపించిన హీరోల పేర్లను ప్రస్తావిస్తూ వర్మ చేసిన ట్వీట్ ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్ 2 అడుగుజాడల్లో పయనిస్తున్న టీఆర్ఎస్ జాతీయ స్థాయి రాజకీయాల్లోకి బీఆర్ఎస్గా ఎంట్రీ ఇవ్వనుందని వర్మ జోస్యం చెప్పారు.
రీల్ ఫిల్మ్ స్టార్లు అయిన యష్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌ల మాదిరిగా కాకుండా కేసీఆర్ రియల్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్‌గా నిలవనున్నారని వర్మ ప్రశంసించారు.