దేశంలోనే అత్యంత బలమైన.. శక్తివంతమైన ముఖ్యమంత్రుల్లో ముందుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన్ను ఒక మాట అని బతికి బట్టకట్టగలిగినోళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. నిజానికి.. ఆయన్ను ఒక మాట అనేందుకు ధైర్యం చేయలేని పరిస్థితి. సోషల్ మీడియాలో ముక్కు ముఖం తెలీనోళ్లు చాలామంది సీఎం కేసీఆర్ ను ఒక మాటను సింఫుల్ గా అనేయొచ్చు. అంతేతప్పించి.. ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ ముఖాన ‘కేసీఆర్ తిక్కలోడు’ అనే మాటను ముఖాన అనేసే దమ్ము.. ధైర్యం ఎవరూ చేయలేరు. కానీ.. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడిగే పత్రికాధిపతి వేమూరి రాధాక్రిష్ణ నోటి నుంచి వచ్చిన మాట విన్నంతనే ఉలిక్కిపడాల్సిందే.
మంత్రి కేటీఆర్ ఎదుట అంత మాట అనేయటం సాధ్యమా? అన్న ప్రశ్న ఒకటైతే.. దానికి మంత్రి కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేయకుండా.. అంత మాట అన్న తర్వాత కూడా కూల్ గా సమాధానం చెప్పటం చూసినప్పుడు.. ఇలాంటి మాటలు అనేసే సాహసం ఆంధ్రజ్యోతి ఆర్కేకు తప్పించి మరొకరికి ఉండదనే భావన కలుగక మానదు. మాకు వ్యతిరేకంగా వార్తలు రాసే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వమన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యల్ని ప్రస్తావించిన ఆంధ్రజ్యోతి ఆర్కే.. ‘ఒక ప్రభుత్వానికి అలాంటి హక్కు ఉండదు. మీరు కేవలం ధర్మకర్తలు మాత్రమే. విచక్షణ ఉందని చెప్పి ట్రెజరీ నుంచి ఇష్టం వచ్చినట్లుగా చెక్కులు డ్రా చేసుకుంటామంటే కుదరదు’ అని స్పష్టం చేశారు.
దీనికి స్పందించిన కేటీఆర్.. ‘విచక్షణ ఉపయోగించి.. ఎక్కడ డబ్బులు వాడాలి. ఎక్కడ వాడకూడదన్నది చూడొచ్చు’ అని పేర్కొన్నారు. దీనికి సమాధానంగా ఆర్కే.. ‘అంతేకానీ.. ఫలానా వాడు మాకు భజన చేసే వాడు కాబట్టి ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని చెప్పటం చట్టవిరుద్ధం’ అని స్పష్టం చేశారు. దానికి బదులుగా మంత్రి కేటీఆర్ సమాధానం ఇస్తూ.. దేశమంతా ఉన్నదే కదా?అని కేటీఆర్ వ్యాఖ్యానించగా.. ‘అవతలవాడు తప్పు చేస్తేనే కదా వేరే వారిని ఎన్నుకునేది. రాజకీయ పార్టీలు సొంత పత్రికలు పెట్టాకే కదా.. సగం అనర్థాలు మొదలైంది. మనలో మనమాట.అసలు ఆ పత్రికల వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా?’ అని సూటిగా అడిగేశారు ఆర్కే.
దానికి బదులిచ్చిన కేటీఆర్.. ‘‘కనీసం మా వాయిస్ చెప్పుకునే వీలుంటుంది. నేను రోజుకు 13 పత్రికలు చదువుతాను. నాకో చెడ్డ అలవాటు ఉంది. ఉదయాన్నే మా నాన్నకు 13 పేపర్లు వస్తాయి ఆయన చదివిన తర్వాత వాటిని తీసుకొని నేను చదువుతా. అదో అలవాటుగా మారింది. ఇప్పుడు మాత్రం నాకు ఒక సెట్.. నాన్నకు ఒక సెట్ వెళుతోంది. అంతే తేడా. రోజు ఆ పేపర్లన్నీ చదువుతా. మాకు వ్యతిరేకంగా రాసిన పత్రికల్ని చదువుతా. అనుకూలంగా రాసే పత్రికల్ని చదువుతా. ఇప్పుడు ఏమైందంటే.. ఏదైనా జరిగినప్పుడు.. అసలేం జరిగిందో తెలుసుకోవటంకోసం నాలుగైదు పత్రికల్ని చదవాల్సి వస్తోంది’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించగా.. దానికి తాను ఒప్పుకుంటానని ఆర్కే బదులిస్తూ.. ‘తిలా పాపం తలా పిడికెడు’ అంటూ అందరూ దీనికి బాధ్యత వహించాల్సిందేనని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో కేసీఆర్ ను తిట్టినంత దారుణంగా దేశంలో మరే ముఖ్యమంత్రిని తిట్టరని.. అంతలా తనను తిడుతున్నా.. వాటికి పట్టించుకోకుండా.. కేసులు పెట్టకుండా ఉంటారన్నారు. అందుకే కేసీఆర్ కు మించిన ప్రజాస్వామ్యవాది ఉండరని అనుకుంటానని వ్యాఖ్యానించారు. దీనికి ఆర్కే బదులిస్తూ.. ‘కేసీఆర్ లో ప్రజాస్వామ్య లక్షణాలు లేవని అనను. నియంత అని పూర్తిగా అనటానికి లేదు. ఇంకా చెప్పాలంటే.. తిక్కలోడు. తిక్క వచ్చినప్పుడు మాత్రం..’’ అంటూ ఏదో చెప్పబోతుండగా అడ్డుకున్న కేటీఆర్.. ‘‘అసలేం కాదు. ఆయన ప్రణాళికబద్ధంగా నడిచే మనిషి. ఆంధ్రజ్యోతి ఆఫీసు కాలిపోతే ఆయనే స్వయంగా వచ్చారు. మీతో ఉన్న స్నహంతో వచ్చి.. పరామర్శించి.. మీకేమైనా చేయాలా? అని అడిగారు. స్నేహం చేసినప్పుడు అలానే ఉంటాడు. ఆయన తిక్కలోడు కాదు. స్నేహం చేసినప్పుడు ఎలా ఉంటాడో.. గొడవైతే అలానే ఉంటాడు. చాలా క్లారిటీతో ఉంటాడు’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
దీనికి స్పందించిన ఆర్కే.. ‘మీరు ముఖ్యమంత్రి. మీరు వ్యక్తులతో వైరం పెట్టుకోకూడదు’ అని పేర్కొనగా.. కేటీఆర్ బదులిస్తూ.. ‘తొమ్మిదేళ్లలో మేమేం తప్పు చేయలేదు. మేమేం పొరపాట్లు చేయలేదు. మేం దైవాంశ సంభూతులం. మేం భూతల స్వర్గం చేశామని నేను అనను. అందరం మనుషులమే. తప్పులు చేస్తాం. కానీ.. రిపీట్ చేయకూడదు. తప్పుల నుంచి ఏం నేర్చుకొని ముందుకు వెళతామన్నది చాలా ముఖ్యం. ఆ కోణంలో చూసినప్పుడు సీఎం కేసీఆర్ తన తప్పుల్ని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటున్నారు’’ అని వ్యాఖ్యానించటం గమనార్హం.