అంతన్నారు ఇంతన్నారు చివరికి అందరూ చతికిలపడి మొదటికి వస్తున్నారు అన్నట్టుంది తెలుగు రాజకీయాల్లో కొందరి పరిస్థితి.
రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రజల ఎమోషన్స్ ను బలమైన ఆయుధంగా చేసుకోవడంలో దిట్టలు కేసీఆర్, జగన్.
వీరి ట్రాప్ లో పడటంలో దిట్టలు… బీజేపీ, జనసేన
బీజేపీ, టిఆర్ఎస్, వైసిపి, జనసేన పక్షాలకు కాలం కలిసొచ్చినంతవరకు ఆటలు సాగుతాయి.
కానీ ఈ ఆటలు ఎంతోకాలం సాగవని ఈ మధ్య జరుగుతున్న కొన్ని ఉదంతాల ద్వారా అర్థమవుతుంది.
అధికారంలోకి వచ్చి ఏడేళ్ళు గడచినా తెలంగాణ దొర కేసీఆర్కు ఉద్యమం తొలి రోజుల నాటి లాగే విద్వేషాలు రెచ్చగొట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే పాలన ఎలా ఉందో అర్ధమవుతుంది.
పౌరుషం వస్తే రక్తం చిందించి ఎదురొడ్డే రాయలసీమ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి తండ్రిని దూషిస్తున్నా నోళ్ళు మూసుకుని పడివున్నారంటే ఎంతకు దిగజారారో ప్రజలు గమనిస్తున్నారు.
ఏ నేత పేరు చెప్పుకుని అధికారం దక్కించుకున్నారో ఆ నాయకుడిని ఇంతగా అవమానపరుస్తుంటే, చీటికిమాటికి రెచ్చిపోయి ఎగిరెగిరి పడే నీలిమూక సైలెంట్ గా ఉంది.
ఉత్తినే లోకేష్ మీద ఎగిరి పడే వైసీపీ గుడివాడ నేత కేసీఆర్ ను ఒక్క మాట అనలేకపోతున్నారు… అంటే ఇది ప్రీ ప్లాన్డ్ తిట్ల వ్యవహారం అని అర్ధమవకుండా ఎలా ఉంటుంది.
విభజన నాడు మిగులు బడ్జెట్ రాష్ట్రం అయిన తెలంగాణ మెల్లగా అప్పుల ఊబిలో కూరుకుపోతుంది అంటే అది పాలనా వైఫల్యమే కదా.
ఉమ్మడి పాలనలో కూడా ఏనాడు లేని అప్పుల మోత ఇపుడు ఎందుకు మోగుతోంది?
ఆంధ్రరాష్ట్రం అంత దారుణం కాకపోయినా బ్యాంకుల నుంచి ఋణం సులభంగా దొరకని పరిస్థితి ఏర్పడే ప్రమాదం వచ్చింది తెలంగాణకు.
రాజకీయంగా ఒక్క శాసనసభ ఫలితం తారుమారైతే ఏమి ఉపద్రవం ముంచుకొస్తుందనే గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న దొర ఏడేళ్ల పాలనలో ఏమి ఒరగబెట్టాడో ప్రజలకు చెప్పుకోలేని పరిస్థితి.
అందుకే లేని నీటి తగాదా సృష్టించి దివంగత నేతను, ఆయన పుత్ర రత్నాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారు.
రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ చాలా రోజుల తరువాత మంచి నిర్ణయం తీసుకుంది.
రేవంత్ రెడ్డిపై ఇటు రాష్ట్రం అటు కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి ఒత్తిడి పెంచే ప్రయత్నం జరుగుతుంది. తెలంగాణలో క్షేత్రస్థాయిలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు ఉన్నాయి.
టిఆర్ఎస్ వైపుకు వెళ్లిన తెలుగుదేశం నాయకులు, శ్రేణులను రేవంత్ రెడ్డి తప్పక ఆకర్షించుకోగలడు. ఉద్యమ స్ఫూర్తితో టిఆర్ఎస్ తో ఉన్న మద్దతుదారులకు దొర పోకడలతో ఎప్పటినుంచో అసంతృప్తిగా ఉన్నారు.
ఓట్లు చీలితే కాంగ్రెస్ బలపడుతుందనే ఏకైక కారణం వీరు దొర కుటుంబం ఆగడాలు భరిస్తున్నారు. మోడీ ప్రభ మసకబారడంతో ఉద్యమ శక్తులకు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే కానుంది.
కాబట్టి కేసీఆర్ ఆటలు ఎంతో కాలం చెల్లేలా కనపడటం లేదు.