`నా చివరి రక్తపు బొట్టు ధారపోసి అయినా సరే ఈ దేశాన్ని చక్కదిద్దుతాను. తప్పకుండా ఆరునూరైనా సరే వందకు వంద శాతం ఈ దేశాన్ని రుజుమార్గంలో పెట్టేందుకు దేవుడి నాకిచ్చిన సర్వశక్తులు, సకల మేథోసంపత్తిని ఉపయోగిస్తా. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా ముందుకు సాగుతున్నాను.“
-ఇది తెలంగాణ సీఎం కేసీఆర్ మాట.
జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లాలో మల్లన్న సాగర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మరింత క్లారిటీ ఇచ్చారు. దీంతో ఏ లాజిక్ ప్రకారం కేసీఆర్ ఇంత ఖచ్చితంగా తానే దేశాన్ని మారుస్తానని అంటున్నారని చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం దేశం దారి తప్పి పోతోందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. `చాలా దుర్మార్గమైన వ్యవస్థ నడుస్తోంది. అసహ్యం పుట్టే పనులు జరుగుతున్నాయి. ప్రజల కోసం పని చేయాలి. ప్రజలకు చేటు చేసే వారిని నిలదీసి ఎదుర్కోవాలి. క్షమించి ఊరుకోవద్దు. మనందరం పురోగమించాలి. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా ముందుకు సాగుతున్నాను. తప్పకుండా ఆరునూరైనా సరే వందకు వంద శాతం ఈ దేశాన్ని రుజుమార్గంలో పెట్టేందుకు దేవుడి నాకుచ్చిన శర్వశక్తులు, సకల మేథోసంపత్తి ని ఉపయోగించి, చివరి రక్తం బొట్టు ధారపోసి అయినా సరే ఈ దేశాన్ని చక్కదిద్దుతాను. దేశంలో ఉన్నం కాబట్టి వంద శాతం మనం ముందుకు పోవాలి.` అంటూ తన పాత్ర ఖాయంగా ఉంటుందని నొక్కి చెప్పారు.
జాతీయ రాజకీయాల్లో తాను సైతం మిగతా నేతల వలే పాత్ర పోషిస్తానని చెప్పే బదులుగా… తానే దేశం కోసం నిర్ణయాలు వెలువరిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం చర్చకు తెరలేపుతోంది. బంగారు తెలంగాణ వలే బంగారు భారతదేశం నిర్మిస్తానని కూడా కేసీఆర్ ప్రవచిస్తున్నారు.
బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయ వేదిక నిర్మించడంలో బిజీగా ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్… ఈ ప్రాంతీయ పార్టీల కూటమిలో తన ఆలోచనల ప్రకారం ఎలా నిర్ణయం తీసుకోగలరు అనేది సహజంగానే తెరమీదకు వచ్చే అంశం. మరింత లోతుగా ఆలోచిస్తే, ఈ ప్రాంతీయ పార్టీల కూటమి అధికారంలోకి రావడం, ఈ రూపంలో ఏదో ఒక కీలక పాత్రను తన సొంతం చేసుకోవడం అనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారనే టాక్ వినిపిస్తోంది.