ఎందుకో.. ఏమో.. తెలియదు కానీ, బీఆర్ ఎస్ అగ్రనాయకుల వ్యవహార శైలి.. సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఓటేసిన ఎమ్మెల్సీ కవిత.. తన సందేశం వినిపిస్తూ.. కేసీఆర్ , బీఆర్ ఎస్‌కు ఓటేయాలని, కారు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. ఇది తీవ్ర వివాదం కావడం.. కాంగ్రెస్ నాయకులు ఆమెపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగాయి.
ఇక, మంత్రి కేటీఆర్ కూడా.. దాదాపు ఇదే తరహాలో వ్యవహరించారు. నేరుగా పిలుపు ఇవ్వలేదు కానీ.. కేసీఆర్‌కే ఓటేయాలని ఆయన పేర్కొన్నారు. ఇది అంత వివాదం కాకపోవడంతో ప్రాధాన్యం సంతరిం చుకోలేదు. ఇక, సీఎం కేసీఆర్.. మాత్రం గతానికి భిన్నంగా వ్యవహించారు. అదికూడా ఎన్నికల నిబంధ నలకు విరుద్ధంగానే ఆయన కూడా వ్యవహరించారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
సీఎం కేసీఆర్ తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. భార్య శోభతో కలిసి వచ్చి ఓటు వేశారు. సిద్దిపేట రూరల్ మండలంలోని చింతమడక గ్రామంలోని తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అయితే.. ఇక్కడే చిత్రమైన విషయం చర్చనీయాంశం అయింది. ఎన్నికల పోలింగ్ కేంద్రం వరకు వాహనం వెళ్లే అవకాశం ఉన్నా.. కేసీఆర్ మాత్రం 500 అడుగుల దూరంలోనే వాహనం దిగిపోయారు. ఇక, అక్కడ నుంచి నమస్కారం చేస్తూ.. చేతులు ఊపుతూ.. పోలింగ్ కేంద్రంలోకి అత్యంతనిదానంగా ముందుకు సాగారు.
ఈ క్రమంలో క్యూలైన్లలో వేచి ఉన్న ఓటర్లను ఆయన పలకరించారు. వారితో కరచాలనం చేశారు. అయితే.. నోరు విప్పలేదు కానీ.. నమస్కారంతోనే ఆయన చెప్పాల్సింది చెప్పేశారని.. కేసీఆర్ సారూ.. ఇదేం తీరు.. అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇలా చేయడంలో తప్పులేదని కొందరు వ్యాఖ్యానిస్తుం డగా.. మరికొందరు మాత్రం నిబంధనలు పక్కాగా పాటించాలని చెబుతున్నారు. ఇదిలావుంటే, మంత్రి హరీశ్ రావు దంపతులు కూడా సిద్ధిపేటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.