టీడీపీ అధినేత చంద్రబాబుకు ఒక రికార్డు ఉంది. ఆయనను విజన్ ఉన్న నాయకుడిగా పేర్కొంటారు. అదేవిధంగా 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు (2004లో ముందస్తుకు వెళ్లారు) విభజన తర్వాత.. ఏపీలో 5 సంవత్సరాలు చంద్రబాబు పాలించారు. అయితే.. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. ఈ రికార్డును తిరగరాస్తున్నారంటూ.. బీఆర్ ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు. మరి ఇది నిజమెంత? అనేది ఆసక్తిగా మారింది.
కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి.. జూన్ 2తో 9 ఏళ్లు పూర్తయి. దీంతో దశాబ్ధి ఉత్సవాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఏకంగా 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రెండు సార్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీఎం కేసీఆర్ మరో రికార్డు సొంతం చేసుకోనున్నారంటూ.. బీఆర్ ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే.. ఏకబిగిన 9 ఏండ్ల పాటు ఆయన పాలించారని.. తెలుగు సీఎంగా కేసీఆర్ జూన్ 2తో రికార్డు సాధించనున్నారని వారు చెబుతున్నారు.
ఇప్పటివరకు మొత్తం 24 మంది తెలుగు రాష్ట్రాన్ని పాలించారు. అయితే, కేసీఆర్ విభజన తర్వాత 2014 జూన్ 2న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2018లో వచ్చిన ముందస్తు ఎన్నికల్లో మరో సారి విజయం దక్కించుకుని డిసెంబర్ 13న రెండోసారి ప్రమాణం చేశారు. దీంతో 2023 జూన్ 2తో తొమ్మిదేండ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకోనున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న వేళ సీఎం కేసీఆర్ ఈ ఖ్యాతి సొంతం చేసుకున్నారని.. బీఆర్ ఎస్ నాయకులు చెబుతున్నారు.
చంద్రబాబు పేరు ఎత్తకుండానే కేసీఆర్ రికార్డు గురించి చెబుతున్నారు. తెలంగాణను ఏకధాటిగా తొమ్మిది సంవత్సరాలు సీఎంగా పాలించడంతోపాటు కేసీఆర్.. తొలి తెలుగు వ్యక్తిగా చరిత్ర సృష్టించడం పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక తెలుగు నాయకుడు ఒక రాష్ర్టానికి, నిరంతరాయంగా, ఏకబిగిన అత్యధికకాలం 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఇదే మొదటి సారి కావడంతో బీఆర్ ఎస్ నాయకులు సంబరాలకు రెడీ అవుతున్నారు.
అంతకుముందు ఉమ్మడి రాష్ట్రానికి (ఆంధ్రప్రదేశ్) సీఎంలుగా పనిచేసిన తెలుగువారిలో అత్యధిక కాలం పదవిలో ఉన్న రికార్డు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేరిట ఉంది. ఆయన మూడు విడతల్లో మొత్తం 13 ఏళ్ల 247 రోజుల పాటు సీఎంగా ఉన్నారు. అయితే ఆయన ఏకబిగిన ముఖ్యమంత్రిగా కొనసాగింది మాత్రం 8 ఏండ్ల 256 రోజులు మాత్రమేనని బీఆర్ ఎస్ నేతలు చెబుతున్నారు. సో.. ఇదీ సంగతి!