చూస్తుంటే కేసీయార్ లో టెన్షన్ మొదలైనట్లే ఉంది. ఒకవైపు బీజేపీ మరోవైపు కాంగ్రెస్ ప్రతిరోజు ఏదో ఒక కారణంతో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలతో హోరెత్తించేస్తున్నారు. కాంగ్రెస్ కన్నా కూడా బీజేపీ మరీ దూకుడుమీదుంది. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామే అంటు బీజేపీ నేతలు చేస్తున్న హడావుడి చాలా ఎక్కువగా ఉంది. నిజంగానే అధికారంలోకి వచ్చేస్తారా లేదా అన్నది ఇపుడే చెప్పలేకపోయినా వాళ్ళ హడావుడిని తట్టుకోవటం మాత్రం కేసీయార్ కు కష్టంగానే ఉంది.
కేంద్రంలో అధికారంలో ఉండటం, అందులోను చాలా బలంగా ఉండటంతో రాష్ట్రంలో కమలనాదులను తట్టుకోవటం కష్టంగానే ఉంది. అందులోను బీజేపీ సారధి బండి సంజయ్ స్వతహాగానే బాగా దూకుడుమనిషి. దానికితోడు కేంద్రంలోని పెద్దల మద్దతు కూడా నూరుశాతం ఉండటం, రాష్ట్రంలో అందరి సహకారం సంపూర్ణంగా అందుతుండటంతో ప్రతి విషయంలో కేసీయార్ ను ఢీ కొడుతున్నారు.
దీంతో వచ్చే ఎన్నికల్లో ఒంటిరిగా పోటీచేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని అనుకున్నట్లున్నారు కేసీయార్ అందుకనే వామపక్షాలతో సంబంధాలు కలుపుకునే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగానే కేరళా సీఎం పినరయి విజయన్ తో పాటు సీపీఎం, సీపీఐ జాతీయ కార్యదర్శులకు భారీ విందిచ్చారు.
వామపక్షాల నేతలకు విందు ఇవ్వటం కేసీయార్ తత్వానికే విరుద్ధం. ఎందుకంటే అపాయిట్మెంట్ ఇవ్వమంటేనే సాధ్యం కాదని చెప్పిన వ్యక్తి కేసీయార్. అలాంటిది పిలిచి విందు ఇచ్చారంటే దానివెనుక పెద్ద స్కెచ్ ఉందనే అనుకోవాలి.
తాజా విందు రాజకీయాలతో వామపక్షాలతో పొత్తులకు కేసీయార్ రెడీ అయినట్లే ప్రచారం ఊపందుకుంది. గతంలో కూడా వామపక్షాలతో కలిసి పనిచేసిన రోజులున్నాయి. అయితే విడిపోయిన తర్వాత మళ్ళీ వామపక్షాలను కేసీయార్ దగ్గరకు రానీయలేదు. బీజేపీపై పోరాడటానికి తెలంగాణాలోని కొన్ని నియోజకవర్గాల్లో కమ్యూనిస్టుల అవసరం చాలా ఉందని కేసీయార్ ఫీలవుతున్నట్లున్నారు.
వరంగల్, ఖమ్మం, నల్గొండ లాంటి జిల్లాల్లో వామపక్షాలకు ఇప్పటికీ కొంత బలముంది. వాళ్ళు సొంతంగా సీట్లు గెలుచుకోలేకపోయినా ప్రత్యర్ధుల ఓటమికి కారణమవ్వగలరు. అందుకనే వచ్చే ఎన్నికల్లో వామపక్షాలకున్న ఓట్లను కూడా తనకు అనుకూలంగా మలచుకునేందుకు కేసీయార్ వ్యూహం రచించినట్లు తెలుస్తొంది. పైగా తెలంగాణాలో పెట్టుకునే పొత్తులు జాతీయస్ధాయిలో కూడా కేసీయార్ కు ఉపయోగపడే అవకాశాలున్నాయి. మొత్తం మీద బీజేపీ, కాంగ్రెస్ లు కేసీయార్ ను బాగానే టెన్షన్ పెట్టేస్తున్నాయి.