తెలంగాణ సీఎం కేసీఆర్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ల మధ్య గ్యాప్ వచ్చిందా? కేసీఆర్ కు పుత్ర సమానుడైన సంతోష్ ను ఆయన మందలించారా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ వీరిద్దరి మధ్య చిచ్చురేపిందా? ఈ తరహా పుకార్ల వంటి ప్రశ్నలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం షికార్లు చేస్తున్నాయి. సంతోష్ కు కేసీఆర్ క్లాస్ పీకడంతో ఆయన పార్టీ కార్యకలాపాలకు, కేసీఆర్ వ్యక్తిగత వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో భాగంగా వెన్నమనేని శ్రీనివాసరావును ఈడీ అధికారులు విచారణ జరిపారు. వెన్నమనేనితో కలిసి సంతోష్ కొన్ని వ్యాపారాలు చేస్తున్నారు. ఈ విషయం తెలియడంతో సంతోష్ పై కేసీఆర్ కోప్పడ్డారని పుకార్లు వస్తున్నాయి. కేసీఆర్ క్లాస్ పీకిన తర్వాత సంతోష్ తన ఫోన్ స్విచాఫ్ చేసి సైలెంట్ అయ్యారని టాక్. అంతేకాదు, మూడు నాలుగు రోజులుగా సంతోష్ …కేసీఆర్ వ్యక్తిగత వ్యవహారాలకు, పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే, ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ వర్గాల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ లిక్కర్ స్కామ్ విషయమో..మరో విషయమో తెలియదుగానీ…కేసీఆర్ మందలించడం వల్ల సంతోష్ మానసికంగా కలత చెందారని టీఆర్ఎస్ నేతలు అంతర్గతంగా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఆయన కొంచెం అసంతృప్తిగా ఉన్నారని, హైదరాబాదులోనే ఉన్నారని, త్వరలోనే పార్టీ కార్యకలాపాలలో పాల్గొంటారని కొందరు టీఆర్ఎస్ నేతలు అంతర్గతంగా మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తుంది.