ఇటీవల ఒక మీడియా అధినేతకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ సందర్భంగా మంత్రి కేటీఆర్ నోటి నుంచి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రస్తావన రావటం.. ఆయనతో తమ అనుంబంధం ముందుకు ఎందుకు సాగలేదన్నదానిపై కాస్తంత ఘాటుగానే రియాక్టు కావటం తెలిసిందే. రాజకీయపార్టీ నడిపే తమకు ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలు ఉండకుండా ఉంటాయా?ఆయన చెబితే తాము ఫాలో కావాల్సిన అవసరం ఏముంది? అంటూ బడాయి మాటలు చెప్పటం తెలిసిందే. కట్ చేస్తే..కీలక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గాలి జోరుగా వీస్తుందన్న ప్రచారం అంతకంతకూ ముదిరిన వేళ.. ప్రగతి భవన్ నుంచి పీకేకు అర్జెంట్ గా రావాలన్నా కబురు అందినట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం చూస్తే.. గులాబీ బాస్ పిలుపుతో మూడో కంటికి తెలీకుండా ప్రగతిభవన్ కు వచ్చిన ప్రశాంత్ కిశోర్ తో.. బీఆర్ఎస్ బిగ్ బాస్ కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారంటున్నారు.
వీరిద్దరి మధ్య భేటీ దాదాపు మూడు గంటల పైనే సాగిందని.. ఈ సందర్భంగా ఎన్నికల తీరు తెన్నులతో పాటు.. ఎంతకు అర్థంకాని ప్రశ్నగా మారిన కాంగ్రెస్ గాలి మీదా వారి చర్చ సాగినట్లుగా తెలుస్తోంది. గతంలో తమ ఎన్నికల వ్యూహకర్తగా పీకేను ఎంపిక చేసుకొని.. కొద్ది రోజులకే ఆయన సేవలు తమకు అక్కర్లేదని చెప్పి పంపించేయటం తెలిసిందే. ఇప్పుడు వ్యతిరేక గాలి బలంగా వీస్తుందన్న మాట జోరుగా వినిపిస్తున్న వేళ.. పీకే ఫీడ్ బ్యాక్ ఏమిటన్న విషయాన్ని తెలుసుకోవటానికి పిలిపించినట్లుగా చెబుతున్నారు. అందరు చెప్పినట్లే.. పీకే సైతం కాంగ్రెస్ పార్టీ జోరు మీద ఉందని.. గులాబీ పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది.
ఇదంతా కాదు కానీ.. అర్జెంట్ గా సీన్ మారిపోవాలె.. ఏం చేస్తారో ఏమో? అన్న ఆదేశాన్ని ఇచ్చేయటంతో పీకేకు ఏమీ పాలుపోలేదంటున్నారు. సమయం తక్కువగా ఉన్న వేళ.. తాను చేయగలిగిందిఏమీ లేదన్న మాట పీకే నోటి నుంచి వచ్చినప్పటికీ.. ఏదో ఒకటి చేయాలన్న కేసీఆర్ మాటతో ఆయన రెండు రోజులు టైం అడిగినట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగా తన సొంత టీంతో పెద్ద ఎత్తున గ్రౌండ్ రిపోర్టు సేకరించినట్లుగా తెలుస్తోంది.
సదరు టీం ఇచ్చిన వివరాలు చూసి పీకేతో పాటు.. కేసీఆర్ సైతం ఆందోళనకు గురైనట్లుగా చెబుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. తెలంగాణ అధికార పార్టీకి తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో 40కు మించి సీట్లు రావని తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ ఫ్యామిలీ మీదా.. ఆయన పాలనా వ్యవహారంపైనా ప్రజలు తీవ్ర అసంతృప్తితోనూ.. అంతకుమించి ఆగ్రహంతో రగిలిపోతున్నట్లుగా తేల్చారట.
ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను చేసేదేమీ లేదని.. టైం అయిపోయిందని.. తానేం చేసినా వర్కువుట్ కాదని చెప్పిన పీకే మాట కేసీఆర్ కు షాకిచ్చేలా మారిందంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గౌరవప్రదమైన సీట్లు వచ్చేలా ఏమైనా చేయొచ్చా? అన్న మాటకు సైతం తాను ఏమీ చేయలేనని చెప్పినట్లుగా చెబుతున్నారు. అయితే.. కొన్ని నియోజకవర్గాల్లో చేసే మార్పులతో ఫలితాల్లో కొంత మారే వీలుందని చెప్పటంతో.. ఆయన చేసిన సూచనల్ని యుద్ధ ప్రాతిపదికనఅమలు చేయాలన్న ఆదేశాలు జారీ అయినట్లుగాచెబుతున్నారు. ప్రగతి భవన్ కు పీకే వచ్చిన అంశానికి సంబంధించి అధికారిక ప్రకటన ఏదీ లేనప్పటికీ.. దీనికి సంబంధించి పార్టీ వర్గాల మధ్య జరుగుతున్న చర్చ హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి.