ఎన్నికల ప్రచార స్వరూపమే మారిపోయింది. సోషల్ మీడియా ఎంట్రీ తర్వాత ప్రత్యర్థులపై విరుచుకుపడేందుకు పెద్ద పెద్ద ఉపన్యాసాలు.. తీవ్రమైన వ్యాఖ్యలు మాత్రమే చేయాల్సిన అవసరం లేదని తేలిపోయింది. సూటిగా తగిలే సెటైర్లు.. పంచ్ లు వేసే మీమ్స్ తో పాటు..అనూహ్యంగా తెర మీదకు తీసుకొచ్చే ఫ్లెక్సీలు.. చిట్టి వీడియోలతో దుమ్ము రేపేస్తున్నారు. తాజాగా మాదిగల విశ్వరూప మహాసభ కోసం హైదరాబాద్ కు వచ్చిన ప్రదాని నరేంద్ర మోడీ కి షాకిచ్చే కార్యక్రమాన్ని కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం చేపట్టింది.
ప్రధాని నరేంద్ర మోడీ చేతిలో ముఖ్యమంత్రి కేసీఆర్.. మజ్లిస్ అధినేత అసద్ లు తోలుబొమ్ములన్న అర్థం వచ్చేట్లుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున ఆకర్షించేలా చేశాయి. ముఖ్యమంత్రి కేసీఆర్.. మజ్లిస్ అధినేత అసద్ లను తోలుబొమ్ములుగా చేసి.. పై నుంచి ప్రధాని మోడీ ఆడిస్తున్న అర్థం వచ్చే ఫ్లెక్సీలు హైదరాబాద్ మహానగరంలోని పలు చోట్ల వెలిశాయి.
హైటెక్ సిటీలోని పలుప్రాంతాలతో పాటు ఫ్లైఓవర్ల వద్ద.. ఫుట్ ఓవర్ బ్రిడ్జిల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.ఈ సరికొత్త ప్రచారం బీజేపీతో పాటు.. బీఆర్ఎస్.. మజ్లిస్ పార్టీల్లో కలకలాన్ని రేపింది. ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో ప్రయాణించే ప్రయాణికులను ఈ ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున ఆకర్షించాయి. బీజేపీకి బీఆర్ఎస్.. మజ్లిస్ బీ టీం అన్న అర్థం వచ్చేలా ఉన్న ఈ ఫ్లెక్సీలను తర్వాత తొలగించారు. వినూత్న రీతిలో విరుచుకుపడుతున్న కాంగ్రెస్ ప్రచారానికి బీఆర్ఎస్.. బీజేపీలకు కొత్త తలనొప్పిగా మారిందన్న మాట వినిపిస్తోంది.