ఎప్పుడేం చేయాలో తెలిసిన వారికి ఏం చేయకూడదో కూడా ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు.. ఎప్పుడేం చేయాలో తెలిసినంత బాగా మరెవరికీ తెలీదనే చెప్పాలి. అన్నింటికి మించిన తన కొడుకు విషయంలో ఎలా వ్యవహరించాలన్న దానికి ఆయన ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. కొడుకు మీద ప్రేమను ఏనాడు బాహాటంగా బయటపెట్టని ఆయన.. ఆ మధ్యన కొడుక్కి పట్టాభిషేకానికి అన్ని సిద్దం చేయటం తెలిసిందే.
కానీ.. చివర్లో లెక్కలు తేడా వచ్చే అవకాశం ఉందన్న డౌట్ వచ్చింతనే.. కొడుకు ముచ్చట పక్కన పెట్టేసి తానే సీఎం అని.. మరొకరిని చేయాల్సిన అవసరం ఏముందంటూ తేల్చేయటం తెలిసిందే. సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన కేసీఆర్.. ఏనాడు కేటీఆర్ ఎంతటి శక్తివంతుడు అన్న విషయాన్ని మాటల్లో చెప్పే ప్రయత్నం చేయరు. ఆ మాటకు వస్తే మేనల్లుడు హరీశ్ ను అప్పుడప్పుడన్నా పొగుడుతుంటారు. తన కొడుకును తానే పొగడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని.. పొగడ్త ప్రజల్లో నుంచి వచ్చేలా ఆయన ప్లాన్ చేస్తుంటారు.
కేంద్రంలోని మోడీ సర్కారు విధానాలు నచ్చవన్న కొత్త ముచ్చటను తెర మీదకు తీసుకొచ్చి.. తెలంగాణ రైతాంగం పండించే వరిని కొంటారా? లేదా? అన్న సింఫుల్ మాటను సూటిగా ప్రశ్నిస్తూ ధర్నా చౌక్ వద్దకు వెళ్లి.. ధర్నాలో కూర్చున్నారు. ఇందుకోసంభారీ ఏర్పాట్లు చేశారు. తానే ధర్నా చౌక్ కు వచ్చిన వేళ.. పార్టీకి చెందిన ఎంపీలు.. మంత్రులు.. ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేలు.. జెడ్పీ ఛైర్మన్లు సహా అందరిని ధర్నా చౌక్ వద్దకు రావాలన్న ఆదేశాల్ని జారీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదిక మీద తన కుమారుడు కేటీఆర్ కానీ కుమార్తె కవిత కానీ.. మేనల్లుడు హరీశ్ కానీ.. బంధువు సంతోష్ కానీ ఎవరూ వేదిక మీద కనిపించటం కానీ హడావుడి చేయటం కానీ కనిపించలేదు.
ఇక.. ధర్నా కార్యక్రమానికి హాజరైన పార్టీకార్యకర్తలు.. నేతల మధ్య ప్లకార్డు పట్టుకొని కూర్చున్నారు మంత్రి కేటీఆర్. కేంద్ర విధానాల్ని తప్పు పడుతూ ఆయన జనాల్లో కూర్చున్న వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. నాలుగు గోడల మధ్య ఎలా ఉన్నా.. అందరి ముందు మాత్రం.. అందరూ స్ఫూర్తివంతంగా తీసుకునేలా ఉండటం చూస్తే.. తండ్రి కొడుకుల రాజకీయ చతురతకు ముచ్చట పడాల్సిందే.