ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్లే ఉంది. ఇప్పటికే స్కామ్ లో కీలక పాత్రదారులనో లేకపోతే సూత్రదారులనో ఈడీ 11 మందిని అరెస్టుచేసిన విషయం తెలిసిందే. తాజాగా అరుణ్ రామచంద్రపిళ్ళై అరెస్టుతో అందరి కళ్ళు కవిత మీదే పడ్డాయి. కారణం ఏమిటంటే ఈడీ దాఖలుచేసిన రిమాండ్ రిపోర్టులో కవితకు తాను ప్రతినిధి(బినామి)గా పిళ్ళై అంగీకరించారని ఈడీ చెప్పటమే. ఇప్పటివరకు అరెస్టయిన వారిలో ఎవరూ కవిత పాత్రపై చెప్పినట్లు ఈడీ ఎక్కడా చెప్పలేదు.
అలాంటిది మొదటిసారి ఈడీ చెప్పిన విషయాలు కలకలం రేపుతున్నాయి. విచారణలో తనతో పాటు సౌత్ గ్రూపులో కీలకమైన అభిషేక్ రావు, ఆడిటర్ బుచ్చిబాబు కూడా లిక్కర్ స్కామ్ లో కవిత బినామీలుగా పనిచేసినట్లు పిళ్ళై చెప్పారట. ఇండో స్పిరిట్ అనేది పిళ్ళైకి చెందిన మద్యం కంపెనీ. ఈ కంపెనీ స్కామ్ లో కీలక పాత్ర పోషించింది. కంపెనీలో కవితకు 32.5 శాతం వాటా ఉందని పిళ్ళై బయటపెట్టినట్లు ఈడీ చెప్పింది. పిళ్ళై ఇచ్చిన సమాచారం ఆధారంగా కవితను ఈనెల 10వ తేదీన ఢీల్లీలో విచారణకు హాజరవ్వాలని ఈడీ నోటీసులు జారీచేసింది.
అంటే కంపెనీ పేరుకు కాగితాల మీద మాత్రమే పిళ్ళైది. నిజమైన ఓనర్ కవితే అని అంగీకరించారట. ఇండోస్పిరిట్ కంపెనీలో ఎవరెవరికి ఎంతెంత వాటా ఉందనే విషయాన్ని కూడా ఈడీ రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా చెప్పిందట. స్కామ్ లో ఇప్పటివరకు కవితకు బాగా సన్నిహితులైన చాలామందిని దర్యాప్తుసంస్ధ అరెస్టు చేసింది. తాజాగా పిళ్ళై అరెస్టు చాలా కీలకంగా మారింది.
ఇపుడీ కేసులో పిళ్ళై గనుక అప్రూవర్ గా మారితే కవిత అరెస్టు తప్పదనే అనుమానాలు బాగా పెరిగిపోతున్నాయి. రెండు రోజుల విచారణలోనే పిళ్ళై ఇన్ని విషయాలు అంగీకరిస్తే మరి వారంరోజుల విచారణలో ఇంకెన్ని విషయాలు బయటపడతాయో అనే ఆసక్తి పెరిగిపోతోంది. ఏదేమైనా సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలంగాణాలో లిక్కర్ స్కామ్ కారణంగా కేసీయార్ కు ఇబ్బందులు తప్పేట్లు లేదు. ఒకవైపు కేసీయార్+కవితకు వ్యతిరేకంగా బీజేపీ దూకుడు పెంచేస్తోంది. ఇదే సమయంలో దర్యాప్తు కూడా జోరందుకుంటోంది. మరి ఈ పరిస్దితులను కేసీయార్ ఎలా ఎదుర్కొంటారో చూడాల్సిందే.