చివరకు ఒత్తిడికి కల్వకుంట్ల కవిత తలొంచక తప్పలేదు. ఈరోజు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరుకాకపోతే పర్యవసానాలు ఎలాగుంటాయో కవితకు బాగా తెలిసొచ్చినట్లుంది. ఇప్పటికే 16వ తేదీన విచారణకు హాజరుకావాల్సిన కవిత థిక్కారం చూపిన విషయం తెలిసిందే. దాంతో 20వ తేదీ విచారణ విషయంలో అందరిలోను ఉత్కంఠ పెరిగిపోయింది. సోమవారం విచారణకు హాజరుకాకపోతే ఈడీ కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశముందని కవిత లాయర్లు చెప్పినట్లు సమాచారం.
కవిత గనుక మరోసారి విచారణకు గైర్హాజరైతే ఇదే విషయాన్ని ఈడీ సుప్రింకోర్టులో పిటీషన్ వేసి చెప్పాలని డిసైడ్ అయ్యిందట. విచారణకు ఉద్దేశ్యపూర్వకంగా గైర్హాజరవుతున్నారు కాబట్టి అరెస్టుచేసైనా సరే విచారించేందుకు అనుమతి కోరుతు ఈడీ పిటీషన్ వేస్తుందనే ప్రచారం విపరీతంగా పెరిగిపోయింది. నిజంగానే కవిత విచారణకు హాజరుకాకుండా రెండోసారి కూడా తప్పించుకుంటే ఈడీ అంతపనీ చేస్తుందనే అనిపించింది.
దాంతో 24వ తేదీన జరగబోయే సుప్రింకోర్టు విచారణపైనా దీని ప్రభావం పడటం ఖాయమని కవితకు లాయర్లు గట్టిగా చెప్పారట. ఎంతసేపు తాను మహిళను కాబట్టి తనకు ప్రత్యేక హక్కులుంటాయనే కవిత వాదిస్తున్నారు. అయితే కవిత మీద ఈడీ పెట్టింది ప్రివెన్షన్ ఆఫ్ మనీల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కావటంతో ప్రత్యేకహక్కులన్నమాట చెల్లదు. అన్నీ విషయాలను లాయర్లతో సమీక్షించుకుని పరిస్ధితులు దిగజారకముందే తెలివిగా నడుచుకోవాలని డిసైడ్ అయినట్లున్నారు.
అందుకనే చేసేదిలేక చివరకు కవిత ఒత్తిడికి తలొంచి ఈడీ విచారణకు హాజరయ్యారు. కేసీయార్ ఇంటినుండి భర్త, లాయర్ తో కలిసి ఈడీ ఆఫీసుకు చేరుకున్న కవిత ఆఫీసులోకి ఒక్కళ్ళే వెళ్ళారు. ఆమె భర్త, లాయర్ మాత్రం ఆఫీసు బయటే నిలిచిపోయారు. మొత్తానికి విచారణలో ఏమి జరుగుతుందనే విషయాన్ని పక్కనపెట్టేస్తే కవితపై మైండ్ గేమ్ అప్లై చేయటంలో మాత్రం ఈడీ సక్సెస్ అయినట్లే అనిపిస్తోంది. ఎందుకంటే ఈడీ చేతిలోని అధికారాలు ఆ స్ధాయిలో ఉన్నాయి మరి. కవితతో పాటు ఇప్పటికే అరెస్టుచేసిన నిందితులను కాన్ఫ్రంటేషన్ ఎంక్వయిరీ పద్దతిలో విచారిస్తారా ? లేకపోతే కవితను మాత్రమే విడిగా విచారించబోతున్నారా అన్నది కాసేపట్లో తేలిపోతుంది.