హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ను ఓడించేందుకు టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ విశ్వ ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందుకు మాజీ కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు కేసీఆర్. అంతేకాదు, ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. అన్న మాట ప్రకారమే హుజూరాబాద్ టీఆర్ఎస్ నేత కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు ఖరారైనట్లు తెలుస్తోంది.
వాస్తవానికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ గా క్రీడాకారుడైన కౌశిక్‌రెడ్డి పేరును రాష్ట్ర మంత్రివర్గం సిఫార్సు చేసింది. కానీ, కౌశిక్ రెడ్డి సభ్యత్వానికి గవర్నర్ తమిళిసై ఆమోదం లభించలేదు. కౌశిక్ రెడ్డిపై పలు కేసులు ఉన్న నేపథ్యంలో గవర్నర్ ఆయన అభ్యర్థిత్వాన్ని అమోదించకుండా పరీశీలనలో పెట్టారు. దీంతో గత మూడు నెలలుగా ఈ వ్యవహారం పెండింగ్‌లో ఉంది. అయితే, దీనిపై న్యాయపోరాటం కూడా చేస్తానని కౌశిక్ రెడ్డి అన్నారు. కానీ, ఆ దిశగా అడుగులు వేయలేదు.
ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేల కోటాలో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ దక్కదంటూ రెండు, మూడు రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇక, కౌశిక్ రెడ్డి వల్లే టీఆర్ ఎస్ ఓడిందని, ఇది కేసీఆర్ స్వయంకృతాపరాధమేనని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి వ్యాఖ్యలనేపథ్యంలోనూ ఈ వ్యవహారం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మరోవైపు, ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ ఈ నెల 9న విడుదల కానుంది. ఈ నెల 16 వరకు నామినేషన్ల స్వీకరణ, 22న ఉపసంహరణలు ఉంటాయి. ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా గెలుచుకునే సంఖ్యాబలం శాసనసభలో ఏ విపక్షానికి లేదు. దీంతో, 6 స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులే ఏకగ్రీవం కానున్నారు. ఎన్నికలకు ముందు చాలా మంది ఇతర పార్టీల నేతలను టీఆర్ఎస్లోకి కేసీఆర్ ఆహ్వానించారు. వారిలో పెద్ది రెడ్డి, ఎల్ రమణ, మోత్కుపల్లి నర్సింహులు పార్టీలో చేరారు. వీరిలో ఎల్ రమణకు కూడా ఎమ్మెల్సీ ని కట్టబెడతారని హామి ఇచ్చినట్టు తెలుస్తోంది.