కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంపై ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు స్పందించారు. ఈ ఎన్నికల ఫలితాలు బలవంతులపై బలహీనుల విజయమని, కర్ణాటకలో విద్వేష కథ ముగిసి ప్రేమ ద్వారాలు తెరుచుకున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. పేదల పక్షాన పోరాడిన కాంగ్రెస్ పార్టీ ప్రేమతోనే ఎన్నికలను ఎదుర్కొందని, అదే ప్రేమతో కాంగ్రెస్ పార్టీని కర్ణాటక ప్రజలు గెలిపించుకున్నారని చెప్పారు.
ఇది ప్రజావిజయమని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. విద్వేష రాజకీయాలను కన్నడ ప్రజలు తిప్పి కొట్టారని రాహుల్ అన్నారు. ఈ విజయం కర్ణాటకలోని ప్రతి ఒక్కరిదని, ఈ విజయానికి కృషి చేసిన నేతలు, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు అని రాహుల్ అన్నారు. కర్ణాటక ఫలితాలే రాబోయే ఎన్నికల్లో రిపీట్ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఇక, మేనిఫెస్టోలో పెట్టిన ఐదు హామీలను తొలిరోజే నెరవేరుస్తామని రాహుల్ అన్నారు.
తాము నిజాయితీతో, ప్రేమతో పోరాడామని, అందుకే తమను ప్రజలు స్వీకరించి ఇంతటి ఘనవిజయాన్ని కట్టబెట్టారని రాహుల్ భావోద్వేగానికి గురయ్యారు. కర్ణాటకలో ద్వేషంతో నడిచే మార్కెట్ మూత పడిందని ప్రేమ దుకాణాలు తెరుచుకున్నాయని రాహుల్ అన్నారు. మరోవైపు, కాంగ్రెస్ విజయంపై ఆ పార్టీ కీలక నేత ప్రియాంక గాంధీ స్పందించారు. దేశానికి ఈ గెలుపు ఒక చక్కటి సందేశం అని, దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారనేందుకు ఈ ఫలితాలే నిదర్శనం అని ప్రియాంక గాంధీ అభిప్రాయపడ్డారు. విద్వేష పాలనకు ప్రజలు చరమగీతం పాడారని, కన్నడ నాట కాంగ్రెస్ సుపరిపాలన అందిస్తుందని హామీ ఇచ్చారు.