కొంతకాలంగా వస్తున్న ఊహాగానాలకు తగ్గట్టుగానే కన్నడ రాజకీయాల్లో కలకలం రేగింది. నాటకీయ పరిణామాల మధ్య సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా చేస్తున్నట్టు నేడు ప్రకటించారు. అధికారం చేపట్టి రెండేళ్లయిన సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న యడ్డీ…తన నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీ నియమావళికి కట్టుబడి రాజీనామా చేస్తున్నానని, రెండేళ్లు పార్టీని విజయవంతంగా నడిపానని అన్నారు.
గవర్నర్ను కలిసిన యడ్డీ తన రాజీనామా లేఖను అందజేశారు. యడ్యూరప్ప రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలిపారు. తదుపరి సీఎంను ప్రకటించేవరకు కర్ణాటక ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని యడ్యూరప్పను గవర్నర్ కోరారు. 75 ఏళ్లు దాటిన వ్యక్తులు అత్యంత కీలకమైన పదవుల్లో ఉండకూడదన్న బీజేపీ నియమావళి ప్రకారమే యడ్డీ రాజీనామా చేశారని బీజేపీ నేతలు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే కర్ణాటక తదుపరి సీఎం ఎవరన్న చర్చ కన్నడనాట మొదలైంది. యడ్యూరప్ప స్థానంలో ఎవరు సీఎం అవుతారన్న విషయం ఇపుడు చర్చనీయాంశమైంది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, విశ్వేశ్వరన్ హెగ్డే, మురుగేష్ నిరానీ, అరవింద్ బెళ్లాడ్ పేర్లను బీజేపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రరాజకీయాలపై పూర్తిస్తాయిలో పట్టున్న నేతను ఎంపిక చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తోందట.
ఇటు రాష్ట్రం, అటు కేంద్రంలోపట్టున్న ప్రహ్లాద్ జోషికి సీఎం అయ్యే చాన్స్ ఉందని అంటున్నారు. ఇప్పటికే, ఈ విషయంపై అమిత్ షా, జేపీ నడ్డాలు పార్లమెంటు సమావేశాల సందర్భంగా చర్చించుకున్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి. మరోవైపు, యడ్యూరప్పను ఏపీ గవర్నర్ గా నియమించేందుకు బీజేపీ పెద్దలు పావులు కదుపుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.