కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ గెలుస్తుందని దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ బల్లగుద్ది అంచనా వేసినప్పటికీ జేడీఎస్ మద్దతుతో హంగ్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కన్నడనట కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడంతో ఆ పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నాయి.
అయితే, కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. కర్ణాటకకు కాబోయే సీఎం ఎవరు అనే విషయాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిర్ణయిస్తారని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. గెలుపొందిన కాంగ్రెస్ సభ్యులందరినీ సాయంత్రంలోగా బెంగళూరుకు రావాలని ఆదేశించినట్లుగా ఆయన వెల్లడించారు. మరోవైపు, ఈరోజు సాయంత్రం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై తన రాజీనామాను గవర్నర్ కు సమర్పించనున్నారు.
రేపు కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే సీఎం అభ్యర్థిని ఎన్నుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక, మే 15వ తారీకున బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థుల జాబితాలో కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యతో పాటు సీనియర్ నేత డీకే శివకుమార్ ఉన్నారు. అయితే, ఈ ఇద్దరిలో ఎవరిని ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయిస్తుంది అన్నదానిపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది.
ఈసారి కర్ణాటక కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి డీకే శివకుమార్ తీవ్రంగా కృషి చేశారని ఇటు కార్యకర్తల్లోనూ, అటు ప్రజల్లోనూ గట్టి అభిప్రాయం ఉంది. బీజేపీ ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా, కేసులు పెట్టి వేధించి జైలు పాలు చేసినా డీకే శివకుమార్ వాటిని ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించారని ఆయన అభిమానులు అంటున్నారు. అందుకే ఈసారి డీకే శివకుమార్ కు సీఎం పీఠం దక్కే అవకాశం ఉందని పుకార్లు వినిపిస్తున్నాయి.
మే 15న డీకే శివకుమార్ పుట్టినరోజు కూడా కావడం విశేషం. అయితే, పుట్టినరోజునాడు సోనియా గాంధీ తనకు గిఫ్ట్ ఇస్తానని చెప్పారని శివకుమార్ అన్నారు. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ జైల్లో తాను గడిపిన రోజులను గుర్తుచేసుకొని డీకే శివకుమార్ భావోద్వేగానికి గురయ్యారు. తనను బీజేపీ ప్రభుత్వం ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టిందని గుర్తుచేసుకొని శివకుమార్ కన్నీటి పర్యంతమయ్యారు.