ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం నుంచి విజయం సాధించిన టీడీపీ మాజీ నాయకుడు కరణం బలరాం.. మరో ఎత్తుగడ వేశారని అంటున్నారు పరిశీలకులు. నిత్యం వివాదాలు, విభేదాలు, ఘర్సణలతో ఆయన రాజకీయాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎక్కడ ఉన్నప్పటికీ వివాదాలే ఆయనకు ప్రధానం.
కరణం బలరాం.. ప్రజలు, అభివృద్ధి అనేవి ఆయన పెద్దగా పట్టించుకోరని, అసలు ఆయన డైరీలో అవేవీ కూడా ఉండబోవని కూడా అంటున్నారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు వెంకటేష్ కోసం.. తనకోసం .. రెండు నియోజకవర్గాలను దక్కించుకునేందుకు ఆయన తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా మరో రూపు ఎంచుకున్నారు. ఇటీవల.. చీరాల నియోజకవర్గం పరిదిలో మత్స్య కార వివాదం తెరమీదకి వచ్చింది. దీనిలో వేలు పెట్టిన కరణం.. తన పరువును తానే తీసుకున్నారు. దీనిని రాజకీయం చేశారు. అమాయకులైన మత్స్యకారులను రాజకీయాల్లోకి లాగారు. ఆమంచి కృష్ణమోహన్‌పై పైచేయి సాధించేందుకు ప్రయత్నించారు. అయితే.. ఇది రాజకీయంగాను, సానుభూతి కోణంలోనూ కరణానికి ఎదురు తిరిగింది. దీంతో ఆయనపై ఇప్పటి వరకు ఉన్న సానుభూతి పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. దీంతో తన ఇమేజ్ను పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్న కరణం.. నియోజకవర్గంలో శాంతి భద్రతలు, అభివృద్ధి అజెండాను ఎంచుకున్నారు.
తాజాగా జరిగిన కార్యక్రమంలోమాజీ ఎమ్మెల్యే ఆమంచిపై వ్యాఖ్యలు చేశారు. గతంలో శాంతి భద్రతలు క్షీణించాయని, తాను గెలిచిన తర్వాత.. అభివృద్ధి, శాంతి భద్రతలను సమపాళ్లలో ముందుకు తీసుకువెళ్తున్నానని చెప్పుకొచ్చారు. అయితే.. వెంటనే స్పందించిన ఆమంచి వర్గం.. గడిచిన ఏడాదిన్నరలో జరిగిన వివాదాలు, ఘర్షణల తాలూకు వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. తన పుట్టిన రోజు సందర్భంగా కరణం.. చేసిన వివాదాలు, అధికారుల బదిలీల విషయంలో కరణం కుమారుడు చేసిన యాగీ వంటివి ఉండడంతో మొత్తంగా ఇది మరో వివాదంగా మారిపోయింది.
ఈ పరిణామాలతో కరణం పుంజుకోకపోగా.. మరింత వెనుకబడ్డారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. ఏదేమైనా.. రాజకీయాల్లో ఒకింత ఆచి తూచి వ్యవహరించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని సీనియర్ మోస్ట్ నాయకుడిగా కరణం మరిచిపోతున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు పరిశీలకులు.