ప్యార్ కా పంచనామా, సోనూ కే టిటు కీ స్వీటీ, లూకా చుప్పి లాంటి సినిమాలతో ఆకట్టుకున్న బాలీవుడ్ యువ కథానాయకుడు కార్తీక్ ఆర్యన్ కొన్ని రోజులుగా నెగెటివ్ న్యూస్లతోనే వార్తల్లో నిలుస్తున్నాడు. కొన్ని రోజుల కిందటే అతను కరణ్ జోహార్ సినిమా ‘దోస్తానా-2’ నుంచి బయటికి వచ్చేయడం తెలిసిందే.
ఈ విషయంలో బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. స్క్రిప్టు విషయంలో జోక్యం చేసుకోవడం, మార్పులు చేర్పులు సూచించడంతోనే కార్తీక్ను ఈ చిత్రం నుంచి తప్పించారని ప్రచారం సాగింది. కార్తీక్ మీద 20 రోజుల షూట్ కూడా జరిపాక అతడిపై వేటు వేశారట.
దీని వల్ల కొన్ని కోట్ల నష్టం వాటిల్లిందని, దీనిపై కరణ్ గుర్రుగా ఉన్నాడని గుసగుసలు వినిపించాయి. ఇక్కడ కట్ చేస్తే.. షారుఖ్ ఖాన్ నిర్మాణ సంస్థ ‘రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్’ నిర్మిస్తున్న మరో సినిమా నుంచి కూడా కొన్ని రోజుల వ్యవధిలోనే కార్తీక్ తప్పుకోవడం చర్చనీయాంశమైంది.ఈ సినిమా విషయంలోనూ స్క్రిప్టే సమస్య అయిందని, దాన్ని మార్చడంతో కార్తీక్ను మార్చేశారని జోరుగా ప్రచారం సాగింది.
కానీ ఇప్పుడు కార్తీక్ టీం నుంచి ఈ విషయంలో స్పష్టత వచ్చింది. రెడ్ చిల్లీస్ వారి సినిమా నుంచి కార్తీక్ తప్పుకున్న మాట వాస్తవమే అయినప్పటికీ.. అందుకు కారణాలు వేరని.. ఇప్పటికే తాను ఒక థ్రిల్లర్ మూవీ చేస్తున్న నేపథ్యంలో, అది అవ్వగానే రెడ్ చిల్లీస్ నిర్మించే థ్రిల్లర్ సినిమా చేయడం కరెక్ట్ కాదనిపించే ఆ చిత్ర ప్రొడక్షన్ టీంకు విషయం చెప్పి సామరస్య పూర్వకంగానే ఈ సినిమా నుంచి కార్తీక్ తప్పుకున్నాడని అతడి టీం వివరణ ఇచ్చింది.
కొందరు కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చింది. కాగా ‘దోస్తానా-2’ విషయంలో కార్తీక్ పట్ల ఆగ్రహంతో ఉన్న కరణ్ టీం.. అతణ్ని టార్గెట్ చేసిందని.. తన గురించి ఉద్దేశపూర్వంగా దుష్ప్రచారం చేస్తోందని.. అతడి కెరీర్ను దెబ్బ తీసే ప్రయత్నం చేస్తోందని సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు చర్చ నడుస్తోంది.