వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి కొడాలి నాని గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. తన భాషతో, నోటి దురుసుతో నాని తెలుగు ప్రజలకు సుపరిచితుడే. నోటికి వచ్చినట్లుగా మాట్లాడడం, ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్ లను బూతులు తిట్టడం, జగన్ మెప్పు పొందడం నానికి అలవాటు అని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. ఈ క్రమంలోనే ఇటీవల కాపులనుద్దేశించి కొడాలి నాని చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి.
చంద్రబాబు, లోకేష్ లను తిట్టే క్రమంలో కాపు నా కొడుకులను ఎమ్మెల్యే చేయాలి, ఎంపీ చేయాలి, మంత్రి చేయాలి…అంటూ నాని చేసిన వ్యాఖ్యలపై కాపులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొడాలి నానిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న నిప్పులు చెరిగారు. కొడాలి నాని పిచ్చికుక్కలా వ్యవహరిస్తున్నారని, కొడాలి నాని ఓ 420 అని దుయ్యబట్టారు. బీసీలను కించపరుస్తూ మాట్లాడిన కొడాలి నాని అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. బీసీలపై చేసిన అవమానకర వ్యాఖ్యలకు కొడాలి నాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే వైసీపీ నేతల జాతకాలు బయటపెడతానని హెచ్చరించారు.
మరోవైపు, కొడాలి నానిపై ఐక్య కాపునాడు, కాపు సంక్షేమ యువసేన మండిపడుతున్నాయి. కాపులనుద్దేశించి కొడాలి నాని అసభ్యకరంగా దూషించారని, ఎమ్మెల్యే అయి ఉండి కులం పేరుతో బూతులు తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంగవీటి రంగా విగ్రహానికి పూలమాల వేసినంత మాత్రాన సరిపోదని, సాటివారిని గౌరవించాలని హితవు పలికాయి. కొడాలి నానిపై జగన్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. నానిని వైసీపీలోని కాపు నాయకులు ప్రశ్నించాలని, లేకుంటే నానిని ఏ పార్టీ కూడా చేర్చుకోకుండా తీర్మానం చేస్తామని తెలిపాయి.