కాపు రిజర్వేషన్ పేరుతో అమాయక యువతను టీడీపీకి దూరం చేయడమే లక్ష్యంగా ఉద్యమం చేస్తూ వచ్చిన మాజీ మంత్రులు ముద్రగడ పద్మనాభం, చేగొండి హరిరామజోగయ్య ఇన్నాళ్లకు తమ ముసుగు తీసేశారు. తమ ఉచిత సలహాలు పాటించేందుకు అంగీకరించని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై కోపంతో ఏకంగా వైసీపీలో చేరిపోయారు. ముద్రగడ తన కుమారుడు గిరితో కలిసి సీఎం జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆ పార్టీ తీర్థుం పుచ్చుకున్నారు. జోగయ్య జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యుడిగా ఉన్న తన కుమారుడు చేగొండి సూర్యప్రకాశ్‌తో రాజీనామా చేయించి వైసీపీలోకి పంపించారు. తద్వారా కాపు రిజర్వేషన్ ఉద్యమానికి మూతబండ వేసేశారు.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే వారికి కాపు రిజర్వేషన్లు గుర్తుకొస్తాయి.. కాపు రిజర్వేషన్ ఉద్యమం అంటే టీడీపీ, చంద్రబాబుపై విషం చిమ్మడమే అనే స్థాయికి తీసుకెళ్లి.. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తోడ్పడి.. ఉద్యమాన్ని తాకట్టు పెట్టి స్వీయ లబ్ధికి ఏదో పదవి చేపట్టడం… 1989 నుంచి చూస్తున్నదే. వాస్తవానికి జోగయ్య పదేళ్లుగా వారు జగన్‌కు కోవర్టులుగా పనిచేస్తున్నారు.
చంద్రబాబు హయాంలో ముద్రగడ తుని సభను హింసాత్మకంగా మార్చి రైలు దహనానికి కాపు యువతను ప్రేరేపించారు. వారికి రైలు ఎలా తగులబెట్టాలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ కూడా ఇచ్చారు. అయినా కాపు ఓట్లు పోతాయన్న భయంతో చంద్రబాబు ఉపేక్షించారు. ఆ భయంతోనే పార్టీఆవిర్భావం నుంచి వెన్నుముకగా ఉన్న బీసీలను పణంగా పెట్టి మరీ కాపులకు చేయూతనిచ్చారు. వారి కోసం కార్పొరేషన్ ఏర్పాటుచేసి యువత స్వయంఉపాధికి ఏలా రూ.1100 కోట్ల వరకు ఖర్చుపెట్టారు. తర్వాత వారిని బీసీల్లో చేర్చుతూ అసెంబ్లీలో తీర్మానించి కేంద్రం ఆమోదానికి పంపారు. ఆ తర్వాత అగ్రవర్ణ పేదలకు కేంద్రం కల్పించిన ఈడబ్ల్యూఎస్ కోటాలో ఐదు శాతం కాపులకు కేటాయించారు. అయినా కాపులు ఆయన్ను కాదని గత ఎన్నికల్లో జగన్‌వైపు మొగ్గుచూపారు. కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదని ఆరేళ్ల కిందటే ఆయన తేల్చిచెప్పినా ఆయనే ముద్దయ్యారు. చంద్రబాబు కల్పించిన ఐదు శాతం ఈడబ్ల్యూఎస్ కోటాను తీసేసినా కిమ్మనడం లేదు.
బాబుతో కలవకుండా..
కాపులు టీడీపీ వైపు మొగ్గితే తన ఓటమి ఖాయమని జగన్‌కు తెలుసు. కాపు యువత పవన్ వైపు ఉన్నారు. జగన్ అరాచక పాలన చూశాక పవన్ ఆయన ప్రభుత్వాన్ని సాగనంపాలని కంకణం కట్టుకున్నారు. ఇందుకోసం టీడీపీతో చేతులు కలుపుతానని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ఆయన ప్రకటించినప్పటి నుంచి.. అది కుదరకుండా చేసేందుకు జగన్ చేయని ప్రయత్నం లేదు. తొలుత ఆయన అన్న, మెగాస్టార్ చిరంజీవిని ప్రయోగించారు. అది ఫలించకపోయేసరికి ఇద్దరి సినిమాలనూ టార్గెట్ చేశారు. వారిని ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నం చేశారు. పవన్ అన్న నాగేంద్రబాబుకు శాసనమండలి సభ్యత్వం ఎరవేసి దూరం చేయాలని చూశారు. చంద్రబాబుతో చేతులు కలపకుండా కాపు సంఘాలను, తన తాబేదార్లు అయిన పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ వంటివారిని వదిలారు.
పొత్తు చర్చలు సాగుతున్నాయని తెలిసి.. తన కోవర్టులైన ముద్రగడ, జోగయ్యలను ప్రయోగించారు. వారు తమ అనుభవాన్నంతా రంగరించి ఉచిత సలహాలివ్వడం మొదలుపెట్టారు. టీడీపీ పని అయిపోయిందని.. జనసేన 80 శాతం సీట్లలో పోటీచేయాలన్నారు. సీఎం పదవిని పవన్, బాబు చెరి రెండున్నరేళ్లు తీసుకోవాలని.. మొదట పవనే సీఎం పదవి చేపట్టాలని ఏకంగా బహిరంగ లేఖ రాశారు. పదేళ్లుగా పార్టీ నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్న జనసేనాని ప్రాప్తకాలజ్ఞత ప్రదర్శించారు. అనూహ్య పరిణతి చూపారు. తన పార్టీ బలాన్ని సరిగ్గా అంచనా వేశారు. 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలకు పరిమితమయ్యారు. ప్రజల కోసం పనిచేస్తున్న తనకు మాత్రమే కొందరు సీనియర్ నేతలు ఉచిత సలహాలు ఇస్తున్నారని.. బూత మేనేజ్మెంట్ తెలియని అభిమానులను నమ్మి ఎక్కువ సీట్లు తీసుకుంటే.. వైసీపీ గెలవదా అని ప్రశ్నించారు.
తనకు ఉచిత సలహాలిచ్చేవారు రాష్ట్ర భవిష్యత గురించి ఆలోచించాలని హితవు పలికారు. అంతే.. జోగయ్య కస్సుమన్నారు. వాస్తవానికి ఆయన కుమారుడు సూర్యప్రకాశ్ జనసేనలో ఉన్నారు. పాలకొల్లు అసెంబ్లీ స్థానం గానీ, నరసాపురం లోక్‌సభ స్థానం గానీ ఇవ్వాలని పవన్‌ను జోగయ్య కోరారని, ఆయన నిరాకరించారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన తన కొడుకును వైసీపీలోకి పంపించారు. పోనీ అక్కడైనా టికెట్ లభించిందా అంటే.. అదేమీ లేదు. అటు ముద్రగడ కూడా పవన్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. తనను కలిసేందుకు కిర్లంపూడి వస్తానని రెండు సార్లు చెప్పి రాలేదన్నారు. అది తనను అవమానించడమేనని బహిరంగ లేఖ రాశారు.
పార్టీలోకి వస్తే టికెట్ ఇస్తామని వైసీపీ పెద్దల నుంచి హామీ లభించడంతో.. టికెట్ విషయమై మాట్లాడేందుకు కొంతకాలం కిందటే ఆయన అమరావతి వెళ్లారు. పాపం.. రెండ్రోజులు నిరీక్షించినా జగన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మరి ఇది అవమానం కాదా? ఇప్పుడు వైసీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్న తరుణంలోనూ ఘోర అవమానం ఎదురైంది. కిర్లంపూడి నుంచి తాడేపల్లికి వందల కార్లలో, వేల మంది అభిమానులతో వెళ్లి వైసీపీలో చేరేందుకు సిద్ధమైన ముద్రగడకు ‘ఒంటరి’గా రావాలని జగన్ సూచించారు. ‘మీ బల ప్రదర్శనలు మా ముందు వద్దు’ అని తేల్చి చెప్పేశారు. అంతమంది క్యాంపు కార్యాలయానికి వస్తే జగన్ భద్రతకు ముప్పని అధికారులు పేర్కొన్నారు. దీంతో అన్నీ సిద్ధం చేసుకున్న ముద్రగడ తీవ్ర నిరాశకు గురయ్యారు.
ఒకదశలో వైసీపీలో చేరకుండా దూరంగా ఉందామనుకున్నారు. కానీ కాపుల్లో పరువు పోతుందని కేవలం కొడుకుతో మాత్రమే వెళ్లారు. జగన్ తొలుత ఆయన్ను కలిసేందుకు సమయమివ్వలేదు. అయినా ముద్రగడకు బుద్ధిరాలేదు. ఎంపీ పెద్దిరెడ్డి మిథునరెడ్డి , మాజీ మంత్రి కురసాల కన్నబాబు , కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తదితరుల సమక్షంలో కుమారుడు గిరితో కలసి వైసీపీలో చేరారు. ఆ తర్వాత జగన్‌ను కలిశారు. ఇక జోగయ్య.. తన కుమారుడు సూర్యప్రకాశ్‌ను ఆయనకు ముందే వైసీపీలోకి పంపారు. తాను మాత్రం రాజకీయాలకు అతీతుడినని చెప్పుకోవాలని చూశారు. అయినా ఉచిత సలహాలు మానలేదు.
రాయలసీమలో బలిజలు ఎక్కువగా ఉన్న మదనపల్లె, తిరుపతి, అనంతపురం అర్బన్, ధర్మవరం, రాజంపేట, శ్రీకాళహస్తిలను కచ్చితంగా జనసేనే తీసుకోవాలని ఇంకో బహిరంగ లేఖ రాశారు. తన కొడుకు చేరిన వైసీపీ ఈ సీట్లను కాపులకు ఇవ్వలేదు. జగన్‌కు మాత్రం లేఖలు రాయరు. రాస్తే మొదటికే మోసం వస్తుంది. నెలనెలా అందే డబ్బు రాదేమోననేమో! సరే.. వైసీపీలో చేరడం వారి ఇష్టం. కానీ అలా చేరినందుకు టికెట్లు ఇచ్చారా అంటే అదేమీ లేదు. ముద్రగడ పిఠాపురం సీటు కోరుకున్నారు. జోగయ్య తన కొడుక్కి పాలకొల్లు అడిగారు. పార్టీలో చేరాక చూద్దామన్న జగన్… చివరకు మొండిచేయి చూపారు. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈ ఇద్దరు నేతలు ఇప్పుడేం చేస్తారో చూడాలి.