ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి సీఎం జగన్ భారీ షాక్ ఇచ్చారు. 2008వ సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపిన టీడీపీ నాయకుడు కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడు హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఐదుగురిని జైలు నుంచి విడుదల చేశారు. రాష్ట్రంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వెంకటప్ప నాయుడును 2008 మే 17న ప్రత్యర్థులు పక్కా ప్రణాళిక ప్రకారం కాపుకాసి కోడుమూరు సమీపంలోని మాచాపురం కాల్వ సమీపంలో జీపులో వెళ్తున్న వెంకటప్ప నాయుడు వాహనాన్ని లారీతో ఢీకొట్టి బాంబులు వేసి వేటకొడవళ్లతో దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటనలో అతనితోపాటు మరో 8 మంది అనుచరులు సంఘటన స్థలంలోనే దారుణ హత్యకు గురికాగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అప్పట్లో ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు మద్దిలేటి నాయుడు, వారం పద్మక్కతోపాటు మొత్తం 48 మందిపై కేసు నమోదైంది. ఆదోని న్యాయస్థానంలో ఈ కేసుపై విచారణ కొనసాగింది. 2014 డిసెంబరు 8న 21 మంది నిందితులపై నేరం రుజువు కావడంతో న్యాయస్థానం వారికి జీవిత ఖైదు ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది.
కాగా.. కేసు విచారణ కొనసాగుతుండగా నిందితుల్లో నలుగురు మృతి చెందగా, శిక్ష ఖరారైన తర్వాత మరో ముగ్గురు మృతి చెందారు. మిగిలిన వారు కడప కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. అయితే.. ఇప్పుడు కరోనా నేపథ్యాన్ని చూపుతూ.. సీఎం జగన్.. హత్య కేసులో ప్రధాన వ్యక్తి అయిన మద్దిలేటి నాయుడుతోపాటు మరో నలుగురిని జైలు నుంచి విడుదల చేశారు. ఈ పరిణామంపై టీడీపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. మరి దీనిపై చంద్రబాబుఎలా రియాక్ట్ అవుతారో చూడాలి