పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీలో లుకలుకలు ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గా కన్నా లక్ష్మీనారాయణను చంద్రబాబు నియమించడంపై కోడెల వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రాబోయే ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించిన కోడెల శివ ప్రసాద్ తనయుడు శివరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడి పని చేపిన తనను పక్కన పెట్టడంపై శివరాం బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు.
పదవి ఇస్తే ఒక పార్టీ, ఇవ్వకపోతే మరొక పార్టీ అనేది కన్నా విధానమని కోడెల శివరాం విమర్శలు గుప్పించారు. ఇప్పటికే మూడు పార్టీలను మారి చివరకు టీడీపీలోకి వచ్చారని కన్నాను దుయ్యబట్టారు. పార్టీ కోసం ప్రాణ త్యాగం చేసిన తన తండ్రికి, కన్నాకు పోలికేంటని ప్రశ్నించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కోడెల వర్సెస్ కన్నా అన్నరీతిలో జరిగేదని, టీడీపీ కార్యకర్తలు, నేతలపై కన్నా కేసులు పెట్టిస్తే..కోడెల విడిపించారని శివరాం గుర్తు చేశారు.
చంద్రబాబును ఏక వచనంతో సంబోధించి దుర్భాషలాడిన కన్నా ఇపుడు స్వలాభం కోసం టీడీపీలో చేరారని దుయ్యబట్టారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన వ్యక్తులకు పదవులు ఇవ్వకపోయినా పర్వాలేదని, కానీ, వారి గౌరవాన్ని మాత్రం తగ్గించకూడదని అన్నారు. తనను నమ్ముకున్న వారి కోసం తాను నిలబడతానని, తన మద్దతుదారుల నిర్ణయాన్ని శిరసావహిస్తానని తెలిపారు. చంద్రబాబు పిలుపు కోసం ఎదురుచూస్తున్నామని, చంద్రబాబుకు తెలియకుండానే ఈ పరిణామాలు జరుగుతున్నాయని తనకు అనిపిస్తోందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచే పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.