ఏపీ బీజేపీలో కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారం కాక రేపుతోంది. ఇటీవల జరిగిన ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరుకాని ఆయన తాజాగా ఈ రోజు భీమవరంలో జరుగుతున్న రాష్ట్ర కార్యవర్గ సమవేశాలకూ డుమ్మా కొట్టడంతో ఆయన బీజేపీతో దాదాపు తెగతెంపులు చేసుకున్నట్లేనని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం నుంచి ఆయనకు ఫోన్ వచ్చినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
ఏపీ బీజేపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాలు భీమవరంలో జరుగుతుండగా కన్నా లక్ష్మీనారాయణ హైదరాబాద్లో ఉన్నారు. ఈ విషయం అధిష్ఠానానికి తెలియడంతో ఆయనకు బీజేపీ పెద్దల నుంచి ఫోన్ వచ్చిందని.. దీంతో ఆయన తన అసంతృప్తి మొత్తం చెప్పారని అంటున్నారు. ముఖ్యంగా తన హయాంలో నియమించిన జిల్లా అధ్యక్షులను తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా సోము వీర్రాజు తొలగించారని.. కనీసం కోర్ కమిటీలో కూడా చర్చించకుండా ఏకపక్షంగా వారిని తొలగించారని కన్నా అధిష్ఠానానికి మరోమారు ఫిర్యాదుచేశారు. అన్ని విషయాలు మాట్లాడుకుని పరిష్కరించుకుందామని, అప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కేంద్రంలోని బీజేపీ పెద్దలు కన్నాతో అన్నట్లు సమాచారం.
కాగా, కన్నా లక్ష్మీనారాయణ రిపబ్లిక్ డే రోజున జనసేనలో చేరుతారన్న ప్రచారం ఒకటి పెద్ద ఎత్తున సాగుతోంది. అయితే. ఏపీ బీజేపీ మాత్రం అలాంటిదేమీ లేదంటోంది. ఆ పార్టీ నేత తురగా నాగభూషణం దీనిపై స్పందించి కన్నా బీజేపీ వీడుతారన్నది అవాస్తవమని.. ఆయన వ్యక్తిగత పనులపై హైదరాబాద్ వెళ్లారని చెప్పారు.
అయితే.. సోము వీర్రాజుతో విభేదాలు సమసిపోకపోవడంతో కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడాలనే నిశ్చయించుకున్నారని ఆయన అనుచరులు అంటున్నారు. రిపబ్లిక్ డే రోజునా లేదంటే ఇంకో రోజునా అనేది ఇంకా నిర్ణయం కానప్పటికీ ఆయన బీజేపీని వీడి జనసేనలో చేరడం ఖాయమని చెప్తున్నారు. బీజేపీలో ఆయన రాజ్యసభ పదవి వంటిదేమైనా వెంటనే హామీ ఇస్తే తప్ప ఆయన ఆ పార్టీలో ఉండడం కష్టమేనన్నది ఆయన వర్గం నుంచే వినిపిస్తోంది.