బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు వివాదాలంటే చాలా ఇష్టం. నిత్యం వివాదాల్లో ఉండకపోతే ఈమెకు ఏ మాత్రం తోచదు. ఆ వివాదాలు ఎంత దాకా వెళ్ళినా సరే ఆమె మాత్రం ఏ మాత్రం వెనక్కు తగ్గదు. తాజాగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న మరుసటి రోజే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
1947లో వచ్చిన స్వతంత్రం పోరాడి సాధించుకున్నది కాదట. అది ఇండియాకు బ్రిటీషు వాళ్ళు వేసిన భిక్షగా కంగనా చెప్పారు. దేశానికి నిజమైన స్వాతంత్ర్యం 2014లోనే వచ్చిందట.
నిజమైన స్వాతంత్ర్యం 2014లో వచ్చిందన్న ఆమె వ్యాఖ్యలకు అర్ధం ఆ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకోవటమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
నిజానికి 1947లో మన దేశానికి వచ్చిన స్వాతంత్ర్యం వెనుక ఎందరో మహనీయుల త్యాగాలున్నాయి. ఎన్నో లక్షలమంది ప్రాణత్యాగాలున్నాయి. అంతటి మహోన్నత పోరాటాలను, లక్షలమంది ప్రాణత్యాగాలను కంగాన చాలా అవమానించారనే చెప్పాలి. ఇపుడు కంగనా చేసింది అసలైన దేశద్రోహమనే విమర్శలు పెరిగిపోతున్నాయి.
తనకు పద్మశ్రీ పురస్కారాన్ని అందించిన మోడీ సర్కార్ ను కంగన పొగడదలచుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు. అందుకని స్వాతంత్ర పోరాటాన్ని అవమానించాల్సిన అవసరం లేదు. ఇంతకాలం బాలీవుడ్ లోని సహచరులపైనే కంగనా చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం మామూలైపోయింది.
తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో గతంలో చాలామందితో కంగన గొడవలు పడింది. ఆమె తీరు చూసిన తర్వాత కంగనకు నిత్యం వివాదాల్లో ఉండటమంటే చాలా సరదా అన్న విషయం అర్ధమైపోతుంది. ఇదే ఊపులో మహారాష్ట్రలోని శివసేన ప్రభుత్వంపైన కూడా నోటికొచ్చినట్లు మాట్లాడటంతో ఎంతపెద్ద గొడవైందో అందరికీ తెలిసిందే.
ఇపుడు తాజా వివాదంతో రాజకీయ పార్టీలు కంగనపై విరుచుకుపడుతున్నాయి. కాంగ్రెస్, సీపీఐ, శివసేన పార్టీల నేతలు కంగన వ్యాఖ్యలను ఖండించారు. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కూడా కంగన వ్యాఖ్యలను ఖండిస్తూ దేశద్రోహం చేసినట్లుగా పరిగణించాలని డిమాండ్ చేయటం గమనార్హం. స్వాతంత్ర్య సమరాన్ని అవమానిస్తూ కంగనా చేసిన వ్యాఖ్యలు దేశద్రోహానికి ఏమీ తీసిపోదంటు ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
తనకు పద్మశ్రీ పురస్కారాన్ని అందించిన మాస్టర్ (మోడి)ను సంతోషపెట్టడం కోసమే కంగన తాజా వ్యాఖ్యలను చేసినట్లు శివసేన నేత ప్రియాంక చతుర్వేది ఘాటుగా స్పందించారు. ఇదే సమయంలో కంగనకు పద్మశ్రీ పురస్కారం ఇవ్వటాన్ని నెటిజన్లు మోడి ప్రభుత్వాన్ని ఓ ఆటాడుకుంటున్నారు.
సోనూసూద్ తో పోల్చితే కంగనా సమాజానికి చేసిన సేవ ఏమిటంటు నెటిజన్లు మోడి సర్కార్ ను నిలదీస్తున్నారు. మొత్తానికి కంగన చేసిన తాజా వివాదాస్పద వ్యాఖ్యల పర్యవసానం ఎలాగుంటుందో చూడాల్సిందే.