కంగనా రనౌత్ ఈ మధ్య తన సినిమాలతో కంటే పొలిటికల్ కామెంట్లతో, వివాదాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. వెండి తెర మీద ఝాన్సీ లక్ష్మీబాయి పాత్ర చేసిన కంగనా.. తనది నిజంగానే ఆ వీరనారి స్థాయి అనుకుంటోందన్న ప్రత్యర్థుల విమర్శలు అతిగా ఏమీ అనిపించడం లేదు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండ చూసుకుని ఆమె సినీ, రాజకీయ ప్రముఖులపై దండెత్తుతున్న సంగతి తెలిసిందే. తన స్థాయికి మించిన అంశాలపై పెద్ద పెద్ద కామెంట్లే చేసేస్తోంది కంగనా. తాజాగా అమెరికా ఎన్నికల ఫలితాల మీద కూడా కంగనా మాట్లాడేసింది.
ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమల హ్యారిస్‌ను పొగిడే క్రమంలో కంగనా చేసిన కామెంట్ శ్రుతి మించిపోయింది. కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ గురించి ఆమె కామెంట్ విమర్శల పాలైంది.బైడెన్‌కు మతిమరుపన్న ఉద్దేశంతో ఆయన్ని ‘గజిని బైడెన్’ అని పేర్కొన్న కంగనా.. ప్రతి ఐదు నిమిషాలకూ ఆయన డేటా క్రాష్ అవుతుందని ఎద్దేవా చేసింది. ఆయన విపరీతంగా మందులు వాడుతున్న నేపథ్యంలో ఏడాదికి మించి ఆయన ఉండకపోవచ్చని, కాబట్టి షో రన్ చేసేది కమల హ్యారిస్యే అని పేర్కొంటూ మహనాళల సాధికారత మీదికి టాపిక్‌ను మళ్లించింది కంగనా.
ఐతే ప్రపంచంలో అగ్ర రాజ్యంగా పేరున్న అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి గురించి ఇలాంటి కామెంట్ చేయడం పట్ల నెటిజన్లు కంగనాను విమర్శిస్తున్నారు. కమల హ్యారిస్‌ను పొగడ్డం సంగతలా ఉంచితే.. ప్రధాని మోడీ మద్దతిచ్చిన ట్రంప్‌ను ఓడించాడన్న అక్కసుతో కంగనా ఈ కామెంట్ చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మరీ ఇంతలా మోడీకి మద్దతుగా ప్రతి విషయంలోనూ వేలు పెట్టాలా అంటూ ఆమెను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఐతే విపరీతంగా నెగెటివ్ కామెంట్లు రావడంతో కంగనా రూటు మార్చింది. తను, అర్నాబ్ లాంటి వాళ్లు తమ పని తాము చేసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చని, కానీ దేశం కోసం తాము వివిధ అంశాలపై పోరాడుతుంటే నెటిజన్లు తమను తప్పుబట్టడం ఏంటని ప్రశ్నించింది.