తమిళనాడు అధికార పక్షం డీఎంకేకు ప్రఖ్యాత నటుడు కమల్ హాసన్ ఏర్పాటు చేసిన ‘మక్కల్ నీది మయ్యమ్’ పార్టీకి మధ్య కుదిరిన పొత్తు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తమిళనాడులో పెద్దగా గుర్తింపు లేని పార్టీగా పేరున్న కమల్ హాసన్ పార్టీతో అధికారంలో ఉన్న డీఎంకే పొత్తు కుదుర్చుకోవడం ఆసక్తికరంగా మారింది.
జరిగేవి సార్వత్రికం కావటం.. ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల్లో స్పష్టంగా ఉండటంతో.. ఆయన్ను.. ఆయన భావజాలాన్ని వ్యతిరేకించే వారంతా కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం కమల్ చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.
పొత్తును ప్రకటించిన కమల్.. సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే కూటమి తరఫున ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయంలో పార్టీ చీఫ్.. రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ తో కమల్ హాసన్ భేటీ అయ్యారు.
అనంతరం ఆయన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. పొత్తులో భాగంగా 2025లో డీఎంకే.. కమల్ హాసన్ పార్టీకి ఒక రాజ్యసభ స్థానాన్ని కేటాయించనున్నట్లు వెల్లడించారు.
పొత్తులో భాగంగా తాను డీఎంకే తరఫున ప్రచారం చేయనున్నట్లుగా కమల్ హాసన్ వెల్లడించారు.
తాము డీఎంకే కూటమిలో చేరినట్లుగా చెప్పిన ఆయన.. సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేయటం లేదని స్పష్టం చేశారు.
త్వరలో నోటిఫికేషన్ విడులయ్యే లోక్ సభా ఎన్నికల్లో తమిళనాడులోని 39 ఎంపీ స్థానాలకు.. పుదుచ్చేరిలోని ఒక లోక్ సభా స్థానం తరఫున డీఎంకే తరఫున తాను ప్రచారం చేస్తానని కమల్ హాసన్ స్పష్టం చేయటం గమనార్హం.