వారాహితో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న విజయాత్రలో భాగంగా మొదటి సభను కత్తిపూడిలో నిర్వహించగా.. రెండో సభను పిఠాపురంలో చేపట్టారు. మూడో సభను ఆదివారం రాత్రి కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలోని సర్పవరం సెంటర్ లో నిర్వహించారు. మిగిలిన రెండు సభలతో పోలిస్తే.. తాజా సభ పెను సంచనలంగా మారటమే కాదు.. పవన్ లో ఇంతటి ఆవేశాన్ని ఇంతకు ముందెప్పుడూ చూడలేదన్న మాట వినిపిస్తోంది. మామూలుగానే పవన్ కల్యాణ్ ఆవేశంగా ప్రసంగిస్తారు.తాజా ప్రసంగం అంతకు మించిన ఫైర్ కనిపించింది.
జనసేన అధినేత చేసిన ప్రసంగాల్లో కాకినాడ సభలో మాట్లాడిన మాటలు పవర్ ఫుల్ గా ఉండటమే కాదు.. స్పెషల్ గా మారిందన్న మాట వినిపిస్తోంది. వారాహితో ఆయన చేపట్టిన విజయాత్ర ఇప్పటికే ఏపీలో రాజకీయ సంచలనంగా మారుతున్న సంగతి తెలిసిందే. తాజా సభలో 80 నిమిషాల పాటు నాన్ స్టాప్ గా మాట్లాడిన పవన్ కల్యాణ్.. అందులో దాదాపు అర గంటకు పైనే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గురించి మాట్లాడటం కనిపిస్తుంది.
ఈ సభకు ముందు కాకినాడలోని ముత్తా క్లబ్ నుంచి సర్పవరం జంక్షన్ వద్దకు వేలాదిగా తరలి వచ్చిన అభిమానుల ర్యాలీ నడుము ఆయన ప్రసంగించారు. ముత్తా క్లబ్ నుంచి సర్పవరం జంక్షన్ వరకు ఉన్న దూరం అర కిలోమీటర్ మాత్రమే. కానీ.. ఈ దూరం వారాహి వాహనం ప్రయాణించటానికి పట్టిన సమయం అరగంటకు పైనే. ఎంత భారీగా జనం వచ్చి ఉంటే.. వారాహి వాహనంలో అరగంట పాటు టైం తీసుకుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటివరకు నిర్వహించిన మూడు బహిరంగ సభల్లో కాకినాడ సభ వారాహి విజయయాత్రలో సో స్పెషల్ అన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. రాజకీయంగా తనకు ప్రత్యర్థులే తప్పించి శత్రువులు ఎవరూ ఉండరని పవన్ చెబుతుంటారు. వ్యక్తిగతంగా కూడా తనకు ఎవరి మీదా ఎలాంటి ద్వేషం ఉండదని చెబుతారు. అలాంటి పవన్ కల్యాణ్.. తొడగొట్టి మరీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గురించి అన్నేసి మాటలు మాట్లాడటం.. శపధం చేసిన తీరు చూస్తే.. రానున్న ఎన్నికల్ని తాను ఎంత సీరియస్ గా తీసుకున్న విషయాన్ని పవన్ తొలిసారి చెప్పేశారని చెప్పాలి. అందుకే.. మిగిలిన సభలతో పోలిస్తే కాకినాడ రూరల్ సభ జనసేనకు సో స్పెషల్ గా చెబుతున్నారు.