వైసీపీ నేతలు కాకినాడలో కొట్టుకోవడం లోకమంతా చూసింది. తాము ప్రజల ప్రతినిధులం అనే విషయం మరిచి వారు ఒకరిపై ఒకరు దాడికి దిగడం, తిట్టుకోవడం చూసి అందరూ అవాక్కయ్యారు. వీధి కుళాయి వద్ద గొడవలా ఉంది అక్కడ పరిస్థితి. దీనిపై లోకేష్ నారా వీడియో షేర్ చేస్తూ తీవ్రంగా స్పందించారు.
‘‘వీధి రౌడీలు ప్రజాప్రతినిధులు అయితే ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదమో కాకినాడ డిఆర్సీ సమావేశం జరిగిన తీరు చూస్తే అర్థమవుతోంది. వైకాపా అధినేత నుండి ఎమ్మెల్యేల వరకూ అభివృద్ధితో సమాధానం చెప్పలేక నోటికి పనిచెబుతున్నారు. సొంత పార్టీ నాయకులే జరుగుతున్న అవినీతిని ఎండగడుతుంటే కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి టిడిపి ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారిని తోసేయ్యడం,మరో ఎమ్మెల్యే చినరాజప్ప గారిని నోరుమూసేయ్ అంటూ బెదిరించడం వైకాపా నాయకులు రౌడీయిజాన్ని మరోసారి బయటపెట్టింది. టిడిపి ఎమ్మెల్యేలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి రౌడీల పాలనలో ప్రజల పరిస్థితి తలచుకుంటే బాధేస్తోంది. ‘‘ అంటూ తీవ్ర పదజాలంతో లోకేష్ స్పందించారు.
ప్రజల రాజ్యాంగం ఇచ్చిన పవిత్రమైన ఓటుహక్కుతో ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఇలా ప్రవర్తించడంపై ఇపుడు కాకినాడలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా అధికార పార్టీ సభ్యులే ఒకరిలో ఒకరు కొట్టుకోవడం మరో విచిత్రం. వైసీపీ అధినేత జగన్ ఏమో 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలించాలనుకుంటున్నారు. కానీ ఆయన అనుచర గణమే ఆయన్ను ఐదేళ్లలోపే దింపేయడానికి ప్రయత్నం చేస్తోంది.