వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రతి గడపకు సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యేతో పాటు వైసీపీ నేతలు వెళ్లాలని, ప్రజాసమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించాలని జగన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకోవాలని, వారికి వైసీపీ ప్రభుత్వం ఏ ఏ పథకాలు అందించింది? ఎంత లబ్ధి జరిగింది అన్న విషయాలను వివరించాలని జగన్ ఆదేశించారు.
ఈ నేపథ్యంలోనే తమ తమ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలతో పాటు స్థానిక వైసీపీ నేతలు కూడా పాల్గొంటున్నారు. అయితే, కొన్నిచోట్ల ఎమ్మెల్యేలకు అనుహ్యంగా నిరసన సెగ తగులుతోంది. తమ ప్రాంతానికి వచ్చిన శాసనసభ్యులను ప్రజలు నిలదీస్తున్నారు. ఈ నాలుగేళ్లలో తమ ప్రాంతంలో అభివృద్ధి జరగలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సొంత నియోజకవర్గంలో నిరసన ఎదురైంది.
రాచర్లపేటలోని ఆరో డివిజన్లో ఉన్న ఎస్సీ కాలనీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వెళ్లిన ద్వారంపూడికి అక్కడి స్థానికులు, మహిళలు షాక్ ఇచ్చారు. ఈసారి జగన్ కు ఎందుకు ఓటేయాలో చెప్పండి అంటూ ఓ మహిళ….ద్వారంపూడిని నిలదీసింది. జగన్ పాలన పూర్తిగా విఫలమైందని, దీర్ఘకాలంగా ఉన్న తమ సమస్యలు పరిష్కారం కాలేదని ఆ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అర్హులకు, ఇల్లు లేని పేదలకు జగనన్న ఇళ్ల స్థలాలు దక్కలేదని, ఆల్రెడీ ఇల్లు ఉండి, ఆర్థిక స్తోమత ఉన్నవారికి ఇళ్ల స్థలాలు దక్కాయని ఆమె ఆరోపించింది. ఆ మహిళా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ద్వారంపూడితోపాటు ఆ వార్డుకు సంబంధించిన వాలంటీర్లు కూడా నీళ్లు నమిలారు. చివరకు ఆ మహిళకు సమాధానం చెప్పలేక ద్వారంపూడితో పాటు వాలంటీర్లు, అధికారులు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో కూడా పలువురు వైసీపీ ఎమ్మెల్యేలకు నిరసన సెగ తగిలిన సంగతి తెలిసిందే.
కాకినాడ రేచర్ల పేట 6వ వార్డులో గడప గడపకి వైసీపీ కార్యక్రమంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని మరియు "వలెంట్రీలని" స్థానిక మహిళలు కడిగి ఆరేసారు. #Hello_AP-Bye_Bye_YCP pic.twitter.com/RYmmktPKdZ
— ఆశయాలు Vs. రాజకీయాలు ???????????? (@I_am_Phoenixx) June 30, 2023
జగన్ రెడ్డి స్వామ్యంలో రాజారెడ్డి రాజ్యాంగంలో ప్రజలపై మోయలేని పన్నుభారం… జగన్ రెడ్డి బినామీ డ్రగ్స్ బియ్యం మాఫియా డాన్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి పన్ను రాయితీ. pic.twitter.com/QN6tF8k3hA
— Telugu Desam Party (@JaiTDP) March 23, 2022